Kumar Verma Also Cheated A Private Contractor, కుమార్‌ వర్మ మరో దందా! - Sakshi
Sakshi News home page

కుమార్‌ వర్మ మరో దందా!... కాంట్రాక్టర్‌నూ వదల్లేదు!

Mar 10 2022 11:24 AM | Updated on Mar 10 2022 12:20 PM

Kumar Verma Also Cheated A Private Contractor - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌ సర్ఫేసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకుడు కుమార్‌ శ్రీనివాస్‌ పెనుమత్స వర్మ అలియాస్‌ కుమార్‌ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ను రూ.కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు.

ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్‌ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్‌ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమార్‌ వర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీ ట్రైనింగ్‌ కిందికి వస్తామని, ఆపై డబ్బు చెల్లిస్తానంటూ కుమార్‌ వర్మ చెప్పగా ఈయన అంగీకరించారు. ఎలాంటి వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకుండా, ఒప్పందపత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ.6 లక్షల చొప్పున రూ.20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు.

ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్‌ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా... 2020లో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్‌ వర్మ అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేనన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు.

మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17 లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు బాధితుడు ఆరా తీయగా ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా చేశాడని, వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్‌ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్‌ జనార్దన, కర్ణ మహేంద్ర రాజ్, అకౌంటెంట్‌ ప్రసన్న కుమార్‌ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు.   

(చదవండి: కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement