మద్యం కోసం ఐటీ ఉద్యోగి వీరంగం

IT employee brawl for alcohol In telangana - Sakshi

ఎయిర్‌ గన్‌తో  బెదిరించి ఐటీ ఉద్యోగి  హంగామా 

జగద్గిరిగుట్ట పోలీసుల అదుపులో నిందితుడు  

సాక్షి, జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పరిధిలోని ఓ వైన్‌ షాపు వద్ద మద్యం ఖరీదు చేయడానికి వచ్చిన ఐటీ ఉద్యోగి ఒకరు.. అక్కడ రద్దీ చూసి కంగుతిన్నాడు. క్యూతో సంబంధం లేకుండా మద్యం పొందడానికి తన వాహనానికి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు సైరన్‌ మోగించాడు. అదేమని ప్రశ్నించిన స్థానికులకు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌ చూపించి బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్‌: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో)

ఆల్విన్‌ కాలనీకి  చెందిన కె.చంద్రహర్షారెడ్డి అలియాస్‌ హరీష్‌ ఐటీ కంపెనీలో ఉద్యోగి. షూటింగ్‌పై మక్కువ ఉన్న ఇతగాడు గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలోని ఫైరింగ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. మంగళవారం తన ప్రాక్టీసు ముగించుకుని ఎయిర్‌ గన్‌తో తన కారులో బయలుదేరారు. ఈ వాహనం ఎల్లమ్మబండ మీదుగా కూకట్‌పల్లి వైపు వెళ్తుండగా..రాత్రి 11 గంటల ప్రాంతంలో లాస్య వైన్స్‌ వద్ద మద్యం ఖరీదు చేయడానికి ఆపాడు. ఆ సమయంలో మద్యం దుకాణం రద్దీగా ఉండటం, మూసివేసే సమయం సమీపిస్తుండటంతో ‘తేలిగ్గా’ తన పని పూర్తి చేసుకోవాలని భావించాడు. అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాలనే ఉద్దేశంతో హరీష్‌ తన కారుకు అక్రమంగా అమర్చుకున్న పోలీసు సైరన్‌ను మోగించాడు. సమీపంలో పాన్‌ షాప్‌ వద్ద నిలుచున్న దిలీప్‌ అనే వ్యక్తి సైరన్‌ ఎందుకు మోగించావంటూ హరీష్‌ను నిలదీశాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగడంతో సహనం కోల్పోయిన హరీష్‌ తన కారులో ఉన్న ఎయిర్‌ గన్‌ను బయటకు తీసి చంపుతానంటూ బెదిరించాడు. కొద్దిసేపు గాల్లో ఎయిర్‌ గన్‌ను ఊపుతూ హంగామా చేశాడు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. హరీష్‌ను అదుపులోకి తీసుకుని వాహనంతో పాటు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పోలీసు సైరన్‌ వినియోగించడంతో పాటు ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు దిగిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top