ఎస్‌ఐ గోవింద్‌పై సస్పెన్షన్‌ వేటు

IPL Betting Case: kamareddy SI Govind Suspended - Sakshi

సాక్షి, కామారెడ్డి : బెట్టింగ్‌ కేసులో అవినీతి ఆరోపణలతో మరో పోలీస్‌ అధికారిపై వేటు పడింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన కామారెడ్డి పట్టణ ఎస్‌ఐ గోవింద్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్‌ కూడా సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. సీఐకి చెందిన లాకర్‌ నుంచి 34 లక్షల నగదు, తొమ్మిది లక్షల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి సుజయ్ సైతం అరెస్ట్‌ అయ్యాడు. కామారెడ్డి పోలీసు శాఖను  ఏసీబీ విచారణ పర్వం వారం రోజుల పాటు కుదిపేసింది. (కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ గుబులు!)

స్పెషల్‌’.. నిద్రలోకి! 
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: పోలీసు శాఖలో ‘ప్రత్యేక విభా గం’ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) విధులు మరిచి సేద తీరుతున్నట్లే కనిపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ నిఘా వ్యవస్థ తరచూ విఫలమవుతోందా..? అవినీతి పోలీసుల సమాచార సేకరణలో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గా లు. ఓ సీఐ స్థాయి అధికారి.. ఎస్సైలు, ఏఎస్సైలు.. క్షేత్ర స్థాయిలో ప్రతి రెండు, మూడు పోలీస్‌స్టేషన్లకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక విభాగం పోలీస్‌ బాస్‌లకు మూడోకన్ను లాంటిది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి కదలికలు, పాస్‌పోర్టులు, జాబ్‌ ఎంక్వైయిరీ వంటి విధులతో పాటు జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు పోలీసు బాస్‌లకు సమాచారం అందించే నిఘా వ్యవస్థ ఇది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్పెషల్‌ బ్రాంచ్‌ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. 

నిఘా పెట్టట్లేదా? 
పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలను ఈ విభాగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు విచ్చ లవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి రూ.లక్షలు దండుకుంటున్నారు. స్టేషన్లనే సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా చేసి, పెద్ద ఎత్తున వెనకేసుకుంటున్నారు. గుట్కా, మట్కా, ఇసుక, మొరం వంటి రెగ్యులర్‌ మామూళ్లతో పాటు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల నుంచి కాసులు దండుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ వల పన్ని పట్టుకుంటేనే ఈ అక్రమార్కుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయే తప్ప.. పోలీసు శా ఖ అంతర్గత నిఘా వ్యవస్థ ద్వారా ఏ అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. (కామారెడ్డి సీఐ జగదీశ్‌ అరెస్టు)

ఏసీబీ పట్టుకుంటేనే వెలుగులోకి.. 
అవినీతి నిరోధకశాఖ దృష్టి సారిస్తేనే అధికారుల అ వినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. నెల క్రితం రియల్‌ ఎస్టేట్‌ ప్లాటు తగాదాలో తలదూర్చిన బోధన్‌ సీఐ రాకేశ్, ఎస్‌ఐ మొగులయ్య రూ.50 వేలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్‌ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు బాన్సువాడ సీఐ టాటాబాబు కూడా ఓ కాంట్రాక్టర్‌ వద్ద లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తాజాగా కామారెడ్డి సీఐ జగదీశ్‌ అవినీతి బా గోతం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో పని చేసిన ఆయ న లాకర్లలో రూ.34 లక్షల నగదు, స్థిరాస్తుల పేప ర్లు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఏసీబీ వల పన్ని పట్టుకుంటేనే పోలీసు శాఖలోని అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయే తప్ప తమ శాఖ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరిస్తున్న అవినీతి అధికారులపై ఈ స్పెషల్‌ బ్రాంచ్‌ నిఘా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసు బాస్‌ల దృష్టికి తీసుకెళ్లడం లేదా..? 
విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వ్యవహారాలను ఎస్‌బీ అధికారులు పోలీసు బాస్‌ దృష్టికి తీసుకెళ్లడం లేదా..? లేక ఎస్‌బీ ఎప్పటికప్పుడు ఇస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయా..? అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో ‘ఆదాయ’ మార్గాలున్న స్టేషన్లలో విధులు నిర్వరిస్తున్న ఈ అవినీతి అధికారుల పట్ల ఉక్కుపాదం మోపడంలో పోలీసు బాస్‌లు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top