మల్లెపూలలో మద్యం బాటిళ్లు 

Illegal Liquor Transport In Jasmine Flower Bags In Anantapur - Sakshi

సాక్షి, ఉరవకొండ: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్‌ పోలీసులు విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా అక్రమార్కులు తమ దందా వీడటం లేదు. శనివారం రాత్రి విడపనకల్లు ఎస్‌ఐ గోపీ ఆధ్వర్యంలో విడపనకల్లు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు. పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా తాము మల్లెపూల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులూ తెలిపారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో మల్లెపూల బస్తాలు లోపల చూడగా అందులో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బయటపడ్డాయి. హైవార్డ్స్‌ బాటిళ్లు 87, వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, 8 పీఎం బాటిళ్లు స్వాధీనం చేసున్నారు. ఎస్‌ఐ గోపీ కేసు నమోదు చేసి కారు, మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు.

ఉరవకొండ సెబ్‌ ఆధ్వర్యంలో దాడులు
స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సూపరిండెంట్‌ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్‌ సీఐ శ్యాంప్రసాద్, విడపనకల్లు ఇన్‌స్పెక్టర్‌ భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, నాగేంద్ర ద్విచక్రవాహనంలో 40 విస్కీ బాటిళ్లు, 96 హైవార్డ్స్‌ విస్కీ బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన అశోక్, మంజునాథ్‌ల నుంచి 192 హైవార్డ్స్‌ విస్కీ టెట్రా ప్యాకెట్లు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామ శివార్లలో పాల్తూరు గ్రామానికి చెందిన నాగరాజు వద్ద 96 విస్కీ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది రియాజ్‌ అహ్మద్, వెంకటేష్, రమేష్‌బాబు, రామకృష్ణ, వీరారెడ్డి, మౌలాలి, శైలజలు పాల్గొన్నారు.

కర్ణాటక మద్యం స్వాధీనం
చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలో పోలీసులు విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో 380 కర్ణాటక మద్యం బాటిళ్లు, ఒక ద్విచక్రవాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి, నాగేంద్రలు కర్ణాటక రాష్ట్రంలోని తిరుమణి నుంచి మద్యం తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.

సెబ్‌ ఉక్కుపాదం
అనంతపురం క్రైం: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు ఆదివారం జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపారు. 5322 టెట్రా ప్యాకెట్లు, 25 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 19 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశారు. అలాగే ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న ఇసుకను సీజ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top