Hyderabad Crime: బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదంటూ.. 

Hyderabad: Student Commits Ends Life By Jumping Into Durgam Cheruvu - Sakshi

దుర్గంచెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య   

మాదాపూర్‌: ‘నేను ఇవాళ రాత్రి 8 గంటలకు దుర్గంచెరువు కేబుల్‌ మీది నుంచి దూకుతున్నాను. నేను చావడం డ్రగ్స్‌ అడిక్ట్‌ వల్లనో, అమ్మాయి వల్లనో కాదు. నేను మరీ అంత చీప్‌ కాదు. కాలేజీ చదువు వల్ల అయితే అసలే కాదు. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదు’అంటూ ఓ ఇంటర్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ మండలం ఓయూ కాలనీలో నివాసముండే బుద్ధవనం సునీల్‌కుమార్‌ మాదాపూర్‌లో ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

ఆయన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్‌ (17) మాదాపూర్‌ కావూరి హిల్స్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ముగియగానే నిఖిల్‌ రోజుమాదిరిగా బుధవారం సాయంత్రం ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వచ్చాడు. తన బ్యాగును అక్కడే వదిలి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాలేదు. నిఖిల్‌కు తండ్రి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది.

అనుమానంతో అతడి బ్యాగును పరిశీలించగా ఈ సూసైడ్‌ నోట్‌ లభించింది. సునీల్‌ వెంటనే మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి దుర్గంచెరువులో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. శుక్రవారం చెరువు ఒడ్డుకు నిఖిల్‌ మృతదేహం కొట్టుకురావడంతో పోలీసులు గమనించి స్వాధీనం చేసుకున్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిఖిల్‌ ఆత్మహత్యకు డిప్రెషన్‌ కారణమని మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్‌ తెలిపారు. డిప్రెషన్‌కు కారణాలు తెలియవని పేర్కొన్నారు. అతడికి ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలేవీ లేవని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top