ఆన్‌లైన్‌లో ‘పాఠాలు’ నేర్చుకుని.. డబ్బులు కొట్టేస్తున్నారు!

Hyderabad: Challenges in Cyber Crime Investigation in India - Sakshi

అంతా ‘సునామీ ఎటాక్స్‌’పై పట్టున్న వాళ్లే

అత్యధికులు ఇంజినీరింగ్, బీటెక్‌ విద్యార్థులే

ఆన్‌లైన్, డార్క్‌వెబ్‌ నేర్పిన పాఠాలతోనే ఇలా 

పెద్ద సంఖ్యలో చిన్న మొత్తాలు స్వాహా

గుర్తించిన పోలీసులు.. సైబర్‌ నిఘాకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: పేజీ సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన దినేష్‌ దాని పూల్‌ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు కాజేయడంతో విషయం పోలీసుల వరకు వచ్చి చిక్కాడు. అదే ఓ హ్యాకర్‌ ఏదైనా పేమెంట్‌ గేట్‌వే సంస్థ లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌ సర్వర్‌ను టార్గెట్‌ చేసి, దాని కస్టమర్ల ఖాతాల నుంచి రూ.10 చొప్పున కాజేస్తే అసలు బయటకే రాదు. సునామీ ఎటాక్స్‌గా పిలిచే ఈ తరహా సైబర్‌ దాడులు ఇటీవల పెరిగిపోయాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. హ్యాకర్లలో ఇంజినీరింగ్, బీటెక్‌ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, ఆన్‌లైన్‌లో ‘పాఠాలు’ నేర్చుకుని, డార్క్‌వెబ్‌లో సాఫ్ట్‌వేర్‌లు ఖరీదు చేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ అంశంపై దృష్టి పెట్టి సైబర్‌ నిఘా ముమ్మరం చేశామని పేర్కొంటున్నారు.  

ఎప్పుడూ పెద్ద మొత్తాల జోలికి పోరు.. 
సర్వర్‌లోకి ప్రవేశించే హ్యాకర్లు ఆయా సంస్థల పూల్‌ ఖాతాలకు యాక్సెస్‌ చేస్తారు. అక్కడ నుంచి ఒకేసారి పెద్ద మొత్తాలు కాజేస్తే విషయం కేసుల వరకు వెళ్లి వీళ్లు చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మొత్తాల జోలికి వెళ్లట్లేదు. ప్రధానంగా ఆయా సంస్థల వినియోగదారుల ఖాతాలను టార్గెట్‌ చేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి, ఒక్కో దఫా కనిష్టంగా రూ.1 గరిష్టంగా  రూ.5 మాత్రమే కాజేస్తారు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాల్లోనివి తాము తెరిచిన వర్చువల్‌ ఖాతాల్లోకి మళ్లించి బిట్‌కాయిన్స్‌గా మార్చేస్తారు. 

గమనించినా ఫిర్యాదు చేయరనే... 
ఖాతాదారుల నగదు కాజేస్తున్న హ్యాకర్లు ఆ లావాదేవీకి సంబంధించిన అలెర్ట్‌ కూడా వారికి వెళ్లకుండా సర్వర్‌లోనే మ్యానేజ్‌ చేస్తున్నారు. ఫలితంగా తన ఖాతా నుంచి ఈ మొత్తం పోయిందనే విషయం కస్టమర్లు గుర్తించలేరు. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు.. ఇలా రౌండ్‌ ఫిగర్‌ నగదు ఉన్న వాటి ఖాతాల జోలికి హ్యాకర్లు వెళ్లరు. అయినప్పటికీ వినియోగదారుడు నగదు పోయినట్లు గుర్తించినా చిన్నమొత్తం కావడంతో ఫిర్యాదు వరకు వెళ్లరు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాలను టార్గెట్‌ చేస్తున్న హ్యాకర్‌కి చేరే మొత్తం మాత్రం భారీగానే ఉంటుంది. తన చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యే వరకు లేదా విషయం ఖాతాదారుడు మర్చిపోతాడని భావించే కాలం వరకు ఈ సునామీ ఎటాక్‌ చేసిన హ్యాకర్‌ మరో ప్రయత్నం చేయరు. 

ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా.. 
నగరానికి చెందిన అనేక మంది ఇంజినీరింగ్, బీటెక్‌ విద్యార్థులు హ్యాకర్లుగా మారారు. వివిధ రకాలైన యూట్యూబ్‌ వీడియోలు, ఆన్‌లైన్‌ అంశాల ఆధారంగా హ్యాకింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇది చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను డార్క్‌వెబ్‌లో ఖరీదు చేస్తున్నారు. టార్గెట్‌ చేసిన సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేయడానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) ఐపీలను వాడుతున్నారు. వీటి ఆధారంగా ఆ సంస్థ సర్వర్‌లోకి ప్రవేశిస్తున్నారు. వాటి ఫైర్‌ వాల్స్‌ బలహీనంగా ఉండటం, సైబర్‌ సెక్యూరిటీలో లోపాలు వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. (క్లిక్‌: మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..)

బిల్లుల చెల్లింపులోనూ గోల్‌మాల్‌... 
ఈ సునామీ ఎటాక్స్‌ చేసే హ్యాకర్లు ‘బిల్లు చెల్లింపు’లోనూ గోల్‌మాల్స్‌ చేస్తుంటారు. వివిధ పోస్టు పెయిడ్‌ సేవలు పొందే పరియస్తులైన కస్టమర్ల కోసమే కమీషన్లు తీసుకుని ఈ పని చేస్తుంటారు. బ్రాండ్‌ బ్యాండ్‌ సహా వివిధ సేవలకు అందించే సంస్థలు తమ ఖాతాదారుడికి ప్రతి నెలా బిల్లు పంపిస్తుంటాయి. దీని చెల్లింపులు అతడు ఆన్‌లైన్‌లో చేస్తుంటాడు. రూ.10 వేల బిల్లు ఉంటే రూ.1000 తీసుకుని ‘మాఫీ’ చేయడం హ్యాకర్‌ పని. వినియోగదారుడి నుంచి ఈ మొత్తం కమీషన్‌గా తీసుకునే సునామీ హ్యాకర్‌ ఆ సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసి, బిల్లు మొత్తం క్లియర్‌ అయినట్లు సున్నాగా మార్చేస్తుంటాడు. ఇది కేవలం పరిచయస్తులైన వారితో కుమ్మక్కై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హ్యాకింగ్‌ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించలేకపోతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్‌: హైఫై ఫ్లైఓవర్‌.. ఎస్సార్‌డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top