ఏలూరు డీఎఫ్‌వోకు రెండు నెలల జైలుశిక్ష

Eluru DFO Sentenced To Two Months In Jail - Sakshi

సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) యశోదాబాయికి కోర్టు ధిక్కార నేరం కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యశోదాబాయి అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.

టెండర్‌ పిలిచి.. వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడంతో..
పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం ఫారెస్ట్‌ రేంజి పరిధిలో టేకు, కలప రవాణా నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ అటవీ శాఖ ఈ ఏడాది జనవరి 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాఖలైన టెండర్లలో ఏలూరుకు చెందిన గోలి శరత్‌రెడ్డి అనే వ్యక్తి లోయెస్ట్‌గా నిలిచారు. అధికారులు అతనికి వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా.. వన సంరక్షణ సమితి ప్రతినిధులతో పనులు మొదలు పెట్టారు. దీనిపై శరత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసేంత వరకు ఎలాంటి పనులు కొనసాగించవద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

వాటిని బేఖాతరు చేస్తూ పనులను కొనసాగిస్తున్నారంటూ జిల్లా అటవీ శాఖాధికారులు టి.శ్రీనివాసరావు, యశోదాబాయిలపై శరత్‌రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ దేవానంద్‌ టెండర్లను రద్దు చేయకుండానే వన సంరక్షణ సమితి చేత టేకు, కలప రవాణా పనులు చేయించడాన్ని తప్పు పట్టారు. వన సంరక్షణ సమితి చేత పనులు చేయించడం వెనుక సదుద్దేశమే ఉంటే, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే టెండర్లు రద్దు చేసి ఆ తరువాత పనులు కొనసాగించి ఉండేవారని తెలిపారు. కోర్టు ధిక్కారం నుంచి తప్పించుకునేందుకే యశోదాబాయి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన రోజునే టెండర్‌ను రద్దు చేశారని తెలిపారు. యశోదాబాయి చెబుతున్న మాటలు, బేషరతు క్షమాపణ వెనుక సదుద్దేశం లేదని, అందువల్ల ఆ క్షమాపణను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ పేర్కొంటూ పై తీర్పునిచ్చారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top