కుమార్తె కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకుని

Cyber Crime: Hyderabad Man Cheated By Fake Detective Agency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్‌లో కాల్‌ సెంటర్ల నెంబర్లే కాదు... వివిధ సంస్థలూ బోగస్‌వి ఉంటున్నాయి. తన కుమార్తె కోసం డిటెక్టివ్‌ ఏజెన్సీని సంప్రదించాలని భావించిన అత్తాపూర్‌ వాసి ఇలాంటి సంస్థ వల్లోపడి రూ.లక్ష నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అత్తాపూర్‌కు చెందిన బాధితుడు (62) ఓఅపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్‌ సైట్స్‌లో రిజిస్టర్‌ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు.

దీనికోసం ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అందులో కనిపించిన నెంబర్‌ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉందని నమ్మబలికారు. వెరిఫికేషన్‌ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్డాన్స్‌గా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్‌ నెంబర్‌ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు.

శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు నివసించే అత్తాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్‌ కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేయాలని శనివారం నిర్ణయించారు. అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top