రుణం పేరుతో నమ్మించి ముంచారు

Criminals who deceived the young farmer in the name of bank representatives - Sakshi

బ్యాంక్‌ ప్రతినిధులమంటూ యువ రైతును మోసగించిన నేరగాళ్లు

ప్రాసెసింగ్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, ఫార్మాలిటీ పేరిట రూ.5 లక్షలు వసూలు

కృష్ణలంక(విజయవాడ తూర్పు): ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువ రైతుకు వ్యవసాయ రుణం పేరిట వైట్‌ కాలర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ ప్రైవేట్‌ బ్యాంకు(హెచ్‌డీఎఫ్‌సీ) నుంచి రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి.. లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, బీమా ఛార్జీలతోపాటు కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు వసూలు చేశారు. అయితే చెప్పిన మేరకు రుణం ఇప్పించకపోగా.. కమీషన్‌ ఇస్తేనే పని జరుగుతుందంటూ చెప్పడంతో అనుమానించిన రైతు చివరకు డబ్బు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయాలని అడగ్గా బెదిరింపులకు దిగారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన ఎ.సురేష్ కుమార్‌ అనే యువ రైతు నందిగామ ప్రాంతంలో తనకున్న 40 ఎకరాల భూమితోపాటు కౌలుకు 80 ఎకరాలు భూములు తీసుకుని అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకు అవసరమైన పెట్టుబడికోసం బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకోవాలనుకున్నాడు. వ్యవసాయ రుణంకోసం అతను ప్రయత్నిస్తుండగా బ్యాంక్‌ ప్రతినిధులమంటూ శ్రీనివాస చక్రవర్తి, వి.సుధాకర్, జి.విజయకుమార్, సత్యరెడ్డి, బి.సాయితేజ, రవి అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్‌ 29న సంప్రదించారు. యువ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, స్పెషల్‌ లోన్‌ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామంటూ నమ్మబలికారు. దీంతో రూ.4 కోట్ల వ్యవసాయ రుణానికి సురేష్‌ దరఖాస్తు చేశాడు. లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజులు, స్టాంప్‌ డ్యూటీలు, ఫార్మాలిటీ పేరుతో రూ.5 లక్షలు తీసుకున్న మోసగాళ్లు ఆస్తుల పరిశీలన, హామీదారుల నుంచి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. మూడు నెలలు దాటాక.. మీకు కోటి రూపాయల లోన్‌ మాత్రమే మంజూరయ్యిందని, అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే 5 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేయాలన్నారు. 

పోలీసులకు ఫిర్యాదు
దీంతో అనుమానించిన సురేష్ కుమార్‌ లోన్‌ అక్కర్లేదు.. డబ్బులు, ఆస్తి పత్రాలు తిరిగిచ్చేయండని కోరాడు. లోన్‌ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్క రూపాయి తిరిగిరాదని, ఆస్తి పత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వారు బెదిరింపులకు దిగారు. దీంతో తన దరఖాస్తు గురించి తెలుసుకునేందుకు బందరురోడ్డులోని బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్‌కు అగ్రికల్చర్‌ లోన్‌ విభాగం వాళ్లెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది చెప్పారు. మోసపోయానని గ్రహించిన సురేష్ కుమార్‌ తనకు న్యాయం చేయాలంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు  తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top