
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అపార్ట్‌మెంట్‌లో ఓ అగంతకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. దోమల్‌గూడలోని సౌభాగ్య అపార్ట్‌మెంట్‌లో సీతా భాగ్యలక్ష్మి(61), జ్యోత్స్న రాణి(66) అనే వృద్ధ మహిళలు నివాసం ఉంటున్నారు. ఈ నెల18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వారి అపార్ట్‌మెంట్‌లోకి ఓ అగంతకుడు చొరబడి గొంతుపై కత్తి పెట్టి వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. దిక్కుతోచని మహిళలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోనే ఉంటున్న మరో మహిళ మరో కత్తితో అగంతకుడిని బెదిరించింది. దీంతో దుండగుడు ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం గాయపడిన సీతా భాగ్యలక్ష్మి, జ్యోత్స్న రాణిలను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరుపర్చారు.
చదవండి: కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్