ఆరిపోయిన దీపం.. శవమైన సౌమ్య

Baby Soumya Suspicious Death In Yellareddy - Sakshi

అపహరించి.. హత్య చేశారా..?

జాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో శవమై తేలిన సౌమ్య

ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి) : అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ ఇంటి దీపం ఆరిపోయింది.. హాయిగా నవ్వుకుంటూ.. నవ్వి స్తూ నట్టింట్లో తిరుగాడిన ఆ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో ఉదయం అదృశ్యమైన చిన్నారి మృతదేహం బుధవారం తన ఇంటికి సుమారు 2కి.మీ దూరంలో ఉన్న నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో లభ్యమైంది. ఈ సందర్భంగా ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో సంతానమైన మాల సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటుండగానే అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, గ్రా మస్తులందరు గ్రామంలో గాలించినప్పటికి ఎలాంటి ఆచూ కీ లభ్యం కాలేదన్నారు.

దీంతో వారు మధ్యాహ్నం చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌లతో కలిసి బృందాలుగా ఏర్పడి గ్రామంలో గాలించామన్నారు. చివరికి కామారెడ్డి నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించగా అది గ్రామ శివారులో కొంతదూరం వెళ్లి ఆగి పోయిందన్నారు. రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో వెనుదిరిగామని, బుధవారం ఉదయం గ్రామ శివారులోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చిన్నారి సౌమ్య మృతదేహం తేలడంతో గ్రామస్తులు తమకు సమాచారం అందించారన్నారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కిష్ట య్య, స్వరూప దంపతులకు ముగ్గు రు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక బాలుడు ఉన్నారు.

బ్యాక్‌వాటర్‌ వరకు వెళ్లడం సాధ్యమేనా..? 
ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో రెండేళ్ళ చిన్నారి సౌమ్య మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమై నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో మృతదేహమై తేలడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి 2కి.మీ దూరంలో ఉండే నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ వరకు రెండేళ్ల చిన్నారి ఎలా నడవగలుగుతుందనే సందేహం ప్రతిఒక్కరిలో కలుగుతోంది. మరో వైపు చిన్నారి మంగళవారం తప్పిపోయి ఉండి నీళ్లలో పడి ఉంటే నీటిలో శవం ఉబ్బి ఉండాల్సి ఉండేది. కాని చిన్నారి నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో కొద్ది గంటల క్రితమే పడినట్లు ఆనవాళ్ళు కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. 

చిన్నారి కుటుంబానికి ఎవరైనా హాని కలిగించాలనే ఉద్దేశంతో జరిగిందా లేదా కావాలనే చిన్నారిని హత్యచేసి బ్యాక్‌ వాటర్‌లో పడేశారా అనే సందేహాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు త్వరగా చిన్నారి మృతి కేసు ను ఛేదించి హంతకులకు శిక్ష పడేలా చర్యలను తీసుకోవాల ని గ్రామస్తులు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top