మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్‌ | 9 Arrested For Molested Minor Girl Forced Into Prostitution | Sakshi
Sakshi News home page

మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్‌

Oct 25 2020 2:05 PM | Updated on Oct 25 2020 2:37 PM

9 Arrested For Molested Minor Girl Forced Into Prostitution - Sakshi

వ్యభిచార కూపంలో చిక్కుకున్న బాధితురాలు మైనర్‌ కావడంతో దిశ చట్టం కింద పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దీంతో సదరు బాలికతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని ప్రస్తుతం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

సాక్షి, కందుకూరు: మైనర్‌తో వ్యభిచారం చేయించిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు దిశ డీఎస్పీ ధనుంజయ తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. జూలైలో కావలి ప్రాంతానికి చెందిన బాలికతో మాధవి అనే మహిళ కందుకూరు–సింగరాయకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయించింది. ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు బాలికను రక్షించి నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిర్వాహకురాలు మాధవి విజయవాడలో కూడా వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు గుర్తించారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న బాధితురాలు మైనర్‌ కావడంతో దిశ చట్టం కింద పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దీంతో సదరు బాలికతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని ప్రస్తుతం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.   (ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య)

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న పోలీసు, ఐసీడీఎస్‌ అధికారులు  

పోన్‌కాల్స్, బ్యాంకు లావాదేవీలు, పోన్‌పే వంటి ఆధారాలను సేకరించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో పొన్నలూరు మండలం చౌటపాలేనికి చెందిన కాట్రగడ్డ శివకుమార్, ఉన్నం నవీన్, పొన్నలూరుకు చెందిన అరవింద్, కొండపి, కనిగిరి, సింగరాయకొండ, ఒంగోలుకు చెందిన సయ్యద్‌ సల్మాన్, కసిరెడ్డి బ్రహ్మారెడ్డి, దేవప్రకాశ్, కోమట్ల ఏడుకొండలు, కందుకూరు మండలం కొండముడుసుపాలేనికి చెందిన గొంది వంశీకృష్ణచౌదరి ఉన్నట్లు వివరించారు. వీరంతా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీదేవి మాట్లాడుతూ వ్యభిచార కూపాల్లో చిక్కుకున్న బాలికలను బాలసదన్‌లో ఉంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి జీవితంపై భరోసా కల్పిస్తామని చెప్పారు.  (ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం)

ఈ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ అయిన వెంటనే బాధితురాలికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తారని, చార్జీషీట్‌ తర్వాత రూ.50 వేలు, కేసు పూర్తయితే రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తామని వివరించారు. కరోనా సమయంలో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదైనట్లు గుర్తించినట్లు పీడీ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు టి.రామాదేవి మాట్లాడుతూ దిశ కేసులో నిందితులను అరెస్టు చేయడం శుభపరిణామం అన్నారు. తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించి బాలికలను ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ విజయ్‌కుమార్, జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శేఖర్, రూరల్‌ ఎస్‌ఐ అంకమ్మ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement