IPL 2023 RCB Vs CSK: ధోని చేసిన తప్పు థర్డ్‌ అంపైర్‌కు కనిపించలేదా?

IPL 2023-MS Dhoni BIG Mistake Ignored By Third Umpire RCB vs CSK Match - Sakshi

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కీపింగ్‌లో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాటర్‌ బంతి మిస్‌ అయి క్రీజు దాటిన సెక‍న్ల వ్యవధిలోనే బెయిల్స్‌ను ఎగురగొట్టంలో ధోని ఘనాపాటి.  తన స్టంపింగ్‌లతో ఎన్నోసార్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. అలాంటి ధోని కీపర్‌గా చేసిన అతి పెద్ద తప్పును థర్డ్‌అంపైర్‌ గుర్తించలేకపోవడం ఆసక్తి కలిగించింది. 

ఇదంతా ఆర్‌సీబీ, సీఎస్‌కేల మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ జడేజా వేశాడు. ఓవర్‌ ఐదో బంతిని కార్తిక్‌ ఆడే ప్రయత్నంలో మిస్‌ చేశాడు. బంతి అందుకున్న ధోని వెంటనే బెయిల్స్‌ ఎగురగొట్టాడు. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించడం.. రిప్లేలో కార్తిక్‌ తన ఫుట్‌ను క్రీజులోనే ఉంచడంతో నాటౌట్‌ అని ప్రకటించడం జరిగిపోయాయి. కానీ అసలు సంగతి అది కాదు.


Photo: IPL Twitter

జడేజా బంతి వేయడం కార్తిక్‌ మిస్‌ చేసిన వెంటనే ధోని బంతిని అందుకున్నాడు. కానీ స్టంప్‌ లైన్‌కు ముందే బంతిని అందుకోవడం ధోని చేసిన పొరపాటు. నిబంధనల ప్రకారం బంతిని కీపర్‌ స్టంప్‌ లైన్‌ పాస్‌ అయిన తర్వాతే అందుకోవాలి. ఒకవేళ నిబంధన ఉల్లంఘిస్తే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. ధోని బంతిని స్టంప్‌లైన్‌ ముందే తీసుకోవడం క్లియర్‌గా కనిపించింది. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఈ విషయాన్ని గమనించలేదు.

దీంతో ఆర్‌సీబీకి నోబాల్‌ అవకాశం మిస్‌ అయింది. ఒకవేళ థర్డ్‌ అంపైర్‌ దానిని నోబాల్‌ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఎందుకంటే అప్పటికి కార్తిక్‌, షాబాజ్‌ అహ్మద్‌లు క్రీజులో ఉండడం.. ఇంకా ఐదు ఓవర్లు మిగిలే ఉన్నాయి. అలా ధోని చేసిన అతి పెద్ద తప్పును థర్డ్‌అంపైర్‌ గమనించకపోవడంతో ఆర్‌సీబీ అభిమానులు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ''థర్డ్‌ అంపైర్‌ సీఎస్‌కే తరపున అనుకుంటా.. అందుకే నోబాల్‌ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కచ్చితంగా ఆర్‌సీబీ గెలిచి ఉండేది'' అంటూ మండిపడ్డారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పరుగుల జడివాడలో సీఎస్‌కే కేవలం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్‌ కాన్వే 83, శివమ్‌ దూబే 52, అజింక్యా రహానే 37 రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే కోహ్లి రూపంలో షాక్‌ తగిలినప్పటికి డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లు సునామీ సృష్టించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు వెనుదిరగడంతో ఆర్‌సీబీ ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత వచ్చిన కార్తిక్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌లు ధాటిగా ఆడినప్పటికి జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. చివరకు ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top