#RavindraJadeja: జడ్డూకు ఫుల్‌ డిమాండ్‌.. సీఎస్‌కే నుంచి బయటికి వస్తే?!

Huge Demand Ravindra Jadeja-3-Teams Intrested-Buy-Him When Leaves CSK - Sakshi

సీఎస్‌కే జట్టులో ముఖ్యమైనవాళ్లలో రవీంద్ర జడేజా ఒకడు. కొన్నేళ్లుగా జడ్డూ సీఎస్‌కేతో పాటే కొనసాగుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ధోని తర్వాత అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్‌కే జడేజాకు పగ్గాలు అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేని జడ్డూ సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మళ్లీ ధోనినే నాయకుడిగా నియమించింది. 

అలాంటి జడేజాకు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో పొసగడం లేదనే పుకార్లు వస్తున్నాయి. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించిన తర్వాత ధోనీతో జడేజాకు కొన్ని చర్చలు జరిగాయని అంటున్నారు. అంతేకాదు.. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్, జడేజాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. చెన్నై జట్టులో జడేజా సంతృప్తికరంగా లేడని ఎప్పటినుంచో చాలా మంది అనుకుంటున్నారు.

ఈ కారణాలన్నింటి కారణంగా రవీంద్ర జడేజా సీఎస్‌కే జట్టు నుంచి తప్పుకుంటాడా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. గత ఎడిషన్‌లోనూ జడ్డూ, మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలున్నట్లు అనిపించింది. అయినా జడేజా ఈ ఎడిషన్‌లో సీఎస్‌కే జట్టులో కొనసాగాడు. ఒకవేళ జడ్డూ ఉన్నపళంగా సీఎస్‌కే నుంచి బయటికి వచ్చి వేలం జాబితాలోకి చేరితే.. అంత నాణ్యమైన ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఇతర జట్లు పోటీపడడం సహజమే. మరి అంత డిమాండ్‌ కలిగిన జడ్డూపై ఒక మూడు జట్లు మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.

ఆర్‌సీబీ(RCB):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈ సీజన్‌లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలహీనంగా ఉండడంతో చాలా పరాజయాలను చవిచూసింది. షాబాజ్ అహ్మద్ ఆల్‌రౌండర్‌గా రాణించడంలో విఫలమైనందున ఒకవేళ రవీంద్ర జడేజా చేరితే మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే, లోయర్ ఆర్డర్‌లో ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా బలపడుతుంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG):
లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఎడిషన్‌లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించే సత్తా ఉన్న జడేజాను లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్‌(MI)
ముంబై ఇండియన్స్‌ కూడా జడ్డూ మీద ఆసక్తి చూపిస్తుంది. రవీంద్ర జడేజా లాంటి ఆటగాడు కోసం ముంబై ఇండియన్స్ ఎదురుచూస్తోంది. జడేజా జట్టులోకి వస్తే జట్టు బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుందనేది నిజం. తదుపరి ఎడిషన్‌లో రవీంద్ర జడేజాను కొనుగోలు చేసే అవకాశం వస్తే ముంబై ఇండియన్స్ ఆ అవకాశాన్ని వదులుకోలేరన్నది నిజం.

ఇక ఈ సీజన్‌లో జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సీఎస్‌కే పదోసారి ఫైనల్‌ చేరడంలో జడ్డూ పాత్రనే కీలకం. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో జడేజా తొలుత బ్యాటింగ్‌లో 22 పరుగులు.. తర్వాత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. 175 పరుగులు చేయడం సహా.. 19 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: ధోనితో సమానంగా గిల్‌.. రికార్డులు బద్దలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top