డెంగీ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

డెంగీ కేసు నమోదు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : చిత్తూరు టి.చవటపల్లె అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలోని తిమ్మసముద్రం దుర్గమ్మ కాలనీలో డెంగీ కేసు నమోదైంది. ఈ క్రమంలో బుధవారం నివారణ చర్యలు చేపట్టారు. జిల్లా మలేరియా అధికారి అనిల్‌కుమార్‌, ఆరోగ్య సిబ్బందితో కలసి క్రిమిసంహారకాలు స్ప్రే చేయించడంతో పాటు ఇంటింటి ఫీవర్‌, లార్వా సర్వే చేపట్టారు. నిల్వ నీటిలో అబేటు మందును పిచికారీ చేసి, స్థానికులకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఫ్రైడే డ్రైడేను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ దర్శన్‌ పాల్గొన్నారు.

వాట్సాప్‌ మెసేజ్‌లతో అప్రమత్తం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్‌ డూడీ హెచ్చరించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ బ్యాంకు నుంచి డబ్బులు కట్‌ అయినట్లు సైబర్‌ నేరగాళ్లు నకిలీ సందేశాలను పంపి ఆందోళనతో రిప్లయ్‌ ఇచ్చేలా వల పన్నుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో యస్‌, నో అని రిప్లయ్‌ ఇచ్చే ముందు ఆలోచించాలని సూచించారు. లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా ఫోన్‌లోకి మాల్‌వేర్‌ చొరబడే ప్రమాదముందని, తెలియన నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఖాతా వివరాల కోసం అధికారిక బ్యాంకు యాప్‌నే వినియోగించాలని స్పష్టం చేశారు. మోసపోతే వెంటనే 1930కి కాల్‌ చేయాలని లేదా సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

అడిషనల్‌ ఎస్పీ బదిలీ

కాణిపాకం:అడిషనల్‌ (ఆపరేషన్స్‌) ఎస్పీ షాను షేక్‌ను బదిలీచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమెను నెల్లూరు అడిషనల్‌ ఎస్పీగా నియమించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.

సోలార్‌ సర్వీసులపై

ప్రత్యేక దృష్టి

చిత్తూరు కార్పొరేషన్‌: సోలార్‌ సర్వీసుల మంజూరు విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు ఆదేశించారు. మంగళవారం చిత్తూరు ఈఈ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈఈ మునిచంద్రతో కలిసి మాట్లాడారు. ప్రతి వారంలో డయల్‌యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమంలో వస్తోన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారించాలన్నారు. అలాగే కరెంటోళ్ల జనబాటలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వర్క్‌ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుకు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకూడదని స్పష్టం చేశారు. వినియోగదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ ప్రసాద్‌, కొండయ్య పాల్గొన్నారు.

మరింత వేగంగా సేవలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సరిహద్దులు, హక్కులు, రికార్డుల కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. రీసర్వే పనుల పురోగతిపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టి, ప్రతి వారం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఆరో విడత సర్వే చిత్తూరు డివిజన్‌లో 41 గ్రామాలు, నగరి డివిజన్‌లో 7 గ్రామాల్లో కొనసాగుతోందన్నారు. ఈ సర్వేను ఈ ఏదాది డిసెంబర్‌ 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాలుగో విడత సర్వే మొత్తం 101 గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూ సంబంధిత ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పాత భూ రికార్డులను, ప్రస్తుత క్షేత్రస్థాయి వివరాలతో సరిపోల్చి ఎలాంటి తప్పిదాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో సర్వే శాఖ డీడీ జయరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement