పురపాలక సంఘాల పోరుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా రిజర్వేషన్‌లను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కూటమి పార్టీల్లో కుమ్ములాట ప్రారంభమైంది. ప్రధానంగా చిత్తూరు మేయర్ స్థానంపై రగడ మొదలైంది. పలువురు నేతల సహాయ నిరాకరణ హెచ్చరికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కులాల వారీ సమీకరణ ఆశావహుల్లో టెన్షన్ పెంచుతోంది. బరిలో దిగే అవకాశం దక్కుతుందో లేదో అనే సంశయం అందరినీ వెంటాడుతోంది.
సాక్షి, చిత్తూరు : పురపోరులో తొలి ఘట్టం పూర్తయ్యింది. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేటాయింపులతో కూటమి పార్టీల్లో తేనెతుట్టె కదిలింది. అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అన్నట్టు మున్సిపల్ స్థానాల రిజర్వేషన్లు కొందరికి రాజకీయ సమాధిని కట్టేశాయి. మరికొందరు కూటమి నేతలు పలానా అభ్యర్థికి సహకరించబోమని కుండబద్దలు కొట్టేయడం గమనార్హం.
శ్రీసీకేశ్రీపై కాపుల తిరుగుబాటు..
చిత్తూరు మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే సీకే కుటుంబంలోని వారికి మేయర్ సీటు ఇచ్చినా, తాము పనిచేసే ప్రసక్తే లేదని చిత్తూరులోని బలిజ (కాపు) సంఘం నేతలు కుండబద్దలు కొట్టేశారు. బహిరంగంగా పత్రికా సమావేశం నిర్వహించి మరీ.. సీకే కుటుంబంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో జనసేన నేతలు సైతం ఉండటం విశేషం. ఫలితంగా సీకే కుటుంబం ఇరకాటంలో పడింది. కుప్పం మున్సిపాలిటీ ఎస్సీకి రిజర్వు అయ్యింది. దీంతో చైర్‌పర్సన్ కుర్చీపై ఆశలు పెట్టుకున్న బలిజ, వన్నెకుల క్షత్రియులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక పలమనేరు మున్సిపాలిటీ గత మూడు పర్యాయాలు మహిళలకే రిజర్వు చేశారు. ఈసారి జనరల్ అవుతుందని ఊహించిన తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. చైర్‌పర్సన్ సీటును జనరల్ మహిళకు రిజర్వు చేశారు.
కథ కంచికే..
రిజర్వేషన్ల ఖరారుతో కూటమిలోని కొందరు నాయకుల కథ కంచికి చేరినట్టేనని, వారికి రాజకీయ సమాధి కట్టేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా చిత్తూరు మేయర్ పీఠం జనరల్‌కు కేటాయిస్తారని తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కమ్మ సామాజికవర్గం నుంచి మేయర్ పీఠం ఆశించిన ఈశ్వరనాయుడు, కాపుల్లో కాజూరు బాలాజీ, కటారి హేమలత, ఎల్‌బీఐ లోకేష్‌రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఈ రిజర్వేషన్లు తేల్చేశాయి. అలాగే 2024లో చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఆశించిన భంగపడిన ఆదికేశవులు మనవరాలు చైతన్య లలితాంబికతో పాటు మేయర్ సీటు ఆశించిన జనసైనికులకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. అసలు బీజేపీ ఉందనే విషయాన్నే ఎవరూ గుర్తించలేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కుప్పం బీసీలకు వస్తుందని, చైర్‌పర్సన్ తామేనని తాజా మాజీ చైర్మన్ గోపీనాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, సోమశేఖర్ పెట్టుకున్న ఆశలు అడియాశలుగా మారాయి.
రేపే నోటిఫికేషన్..?
మేయర్, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో ఇక మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్‌పై ఎస్‌ఓపీ (స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) ఉత్తర్వులు ఆయా పురపాలక సంఘాల కమిషనర్లకు అందాయి. ఏ సామాజిక వర్గానికి ఎన్ని వార్డులు కేటాయించాలనే దానిపై ఎస్‌ఓపీలో పొందుపరచారు. మంగళవారం వరకు గడువు ఇవ్వడంతో వార్డుల వారీ రిజర్వేషన్లను కలెక్టర్ ప్రకటించనున్నారు. తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఇందులోనే పంచాయతీ ఎన్నికలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. ఆపై ఎన్నికల నియమావళి అమల్లోకి రావడం, నవంబరు మొదటి వారంలోపు ఎన్నికలు, ఫలితాలు వెలువడడం పూర్తవుతుందని అధికారులు వివరిస్తున్నారు.
జెడ్పీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధాకర్‌రావు హాజరయ్యారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ, అనుసరించాల్సిన మార్గదర్శకాలు, తదుపరి కార్యాచరణపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయించే అంశంపై చర్చించారు. బీసీల రిజర్వేషన్లకు ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జీఓ విడుదలైన వెంటనే రిజర్వేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా గెజిట్ ప్రచురణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్‌పై చర్చ జరుగుతోంది. జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్‌పై నేతల్లో ఉత్కంఠ మొదలైంది. . జిల్లాలో 27జెడ్పీటీసీలకు గాను బీసీలకు 9, అదేఽ విధంగా 27 ఎంపీపీ స్థానాల్లో 9 వరకు, ఎంపీటీసీల్లో 370కి గాను 120 వరకు కేటాయించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


