● బలిజ సంఘం నేతల హెచ్చరిక
సాక్షి టాస్క్‌ఫోర్స్: మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబానికి కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని బలిజ సంఘం నేతలు స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో ఓఎం రామదాసు, పూల చందు కుమార్, కిషోర్, యశ్వంత్, ఆరణి తులసి, మునిరత్నం మాట్లాడారు.
అరాచకాలకు అవకాశం వద్దు
బలిజ సంఘం నేత రామదాసు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఆయ న కుటుంబం కారణంగా బలిజ కులస్తులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, చివరికి ప్రాణాలు సైతం కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మళ్లీ అధికారం అప్పగిస్తే బలిజ కులస్తుల నుంచి వ్యతిరేకత తప్పదని తేల్చిచెప్పారు. గతంలో ఆదికేశవులు నాయడు, ఏఎస్ మనోహర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సైతం సీకే బాబు అనేక పర్యా యాలు అవమానించారని గుర్తుచేశారు.
బలిజలకే ఇవ్వాలి
పూల చందుకుమార్ మాట్లాడుతూ మేయర్ స్థానాన్ని బలిజ కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాజూరు బాలాజీ భార్య లేదా కఠారి హేమలతకు మేయర్ పదవిని కట్టబెట్టాలని కోరారు. మంచి వ్యక్తికి సీటు ఇస్తే మద్దతు ఇస్తామని, లేకపోతే బలిజల సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.
ఆత్మగౌరవానికి పోరాటం
కిషోర్ మాట్లాడుతూ రెండు రోజులుగా సామా జిక మాధ్యమాల్లో సీకే బాబు సతీమణి సీకే లావణ్యకే మేయర్ సీటు ఖరారైందంటూ ప్రచారం జరుగుతోందన్నారు. గతంలో సీకే బాబుతో చిత్తూరు ప్రజలు, చంద్రబాబు సైతం పలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. మళ్లీ రౌడీయిజానికి అవకాశం ఇవ్వవద్దని కోరారు. నగర అభివృద్ధి, ప్రజల భద్రత, ఆత్మగౌరవం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.


