చిత్తూరు కలెక్టరేట్ : ఆడపిల్లల సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ మేరకు అవగాహన పెంపొందించేందుకే పీసీపీఎన్‌డీటీ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్‌లో బహుమతులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో లింగ వివక్ష నిర్మూలన, ఆడబిడ్డల రక్షణ, భ్రూణహత్యల నిరోధంపై అవగాహన ముఖ్యమన్నారు. జిల్లాలోని 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి మొత్తం 19 షార్ట్ ఫిల్మ్‌లు రాగా, లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు వాటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పవన్ కుమార్ అండ్ టీమ్‌కు రూ.30 వేలు (మొదటి బహుమతి), సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన శ్రీవళ్లి అండ్ టీమ్‌కు రూ.20 వేలు (రెండవ బహుమతి), సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన షాలిని అండ్ టీమ్‌కు రూ.10 వేలు (మూడవ బహుమతి) అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ నాగశశిభూషన్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి దేవి, ఐసీడీఎస్ పీడీ శ్యామ సుగుణకుమారి తదితరులు పాల్గొన్నారు.


