చిత్తూరు కలెక్టరేట్ : పారదర్శకంగా ప్రజాపంపిణీ వ్యవస్థ పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో పౌరసరఫరాలు, తూనికలు–కొలతల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటించాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలకు పాల్పడడం, నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు సరుకులు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని చౌకధరల దుకాణాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. డీలర్లతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
అనుసంధానానికి ప్రాధాన్యత
ప్రతి రేషన్ కార్డుదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆధార్తో మొబైల్ నంబర్ లింకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ సూచించారు. ఈ సదుపాయం తహసీల్దార్ కార్యాలయాలు, వీఆర్ఓల వద్ద, చౌకధరల దుకాణాల్లో అందుబాటులో ఉందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కార్డుల ను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తో అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు.
అక్రమ రవాణాపై
ఉక్కుపాదం
రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, రవాణా మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థా యి నుంచి అందే సమాచారం మేరకు తక్షణమే స్పందించి నిబంధనల ప్రకారం 6ఏ కేసులు నమోదు చే యాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారుల పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. జిల్లాలోని అంగన్న్వాడీ కేంద్రాలు, పాఠశా లలు, కళాశాలల సమీపంలోని ఆహార విక్రయ కేంద్రా లు, బీసీ సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు, వసతి గృహాల విద్యార్థులకు అందే ఆహారం, వంటశాలల పరిశుభ్రతలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎటువంటి రాజకీయ, ఇతర ఒత్తిడికి లోనుకాకుండా నిబంధనల మేరకు నిర్భయంగా విధులు నిర్వర్తించాలని కోరారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకట్రాముడు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి పాల్గొన్నారు.


