ఎత్తయిన వృక్షాలపై వెలిసిన మంచెలు ఏనుగులు వస్తే బాణసంచా పేల్చి బెదిరింపులు దారి మళ్లించేందుకు అరుపులు కేకలు పంటల రక్షణకు అటవీ సరిహద్దు గ్రామస్తుల అగచాట్లు
●
ఏనుగుల జాడ కోసం
మంచెలపై రైతులు
కౌండిన్య అభయారణ్య గ్రామాల్లో సాగు చేసిన పంటలను దశాబ్దాలుగా ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఎలిఫెంట్ ట్రెంచ్‌లు.. సోలార్ ఫెన్సింగ్‌లు గజరాజులను నిలువరించలేకపోయాయి. చివరకు కుంకీ క్యాంపు ఏర్పాటు చేసినా కట్టడి చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో సరిహద్దు పల్లెల్లోని రైతులు తమ పంటలను తామే కాపాడుకునేందుకు నడుంబిగించారు. ఎత్తయిన వృక్షాలపై మంచెలను ఏర్పాటు చేసుకుని కళ్లల్లో వత్తులు వేసుకుని కాపలా కాస్తున్నారు. భీ‘కరి’ కనిపించగానే బాణసంచా పేలుస్తూ.. అరుపులు కేకలతో దారి మళ్లించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
పలమనేరు : పలమనేరు మండలంలోని చెత్తపెంట గ్రామం విసిరిపారేసినట్టుగా అడవిలో ఉంటుంది. సుమారు 2వేల కుటుంబాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఊరు వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యంలేదు. గ్రామస్తులకు వ్యవసాయమే ఆధారం. వరి, రాగి, మొక్కజొన్న, అరటి, వేరుశనగ, టమాట పంటలను సాగుచేస్తుంటారు. వీరి భూములన్నీ అడవికి ఆనుకునే ఉన్నాయి. నిత్యం అడవిలోంచి ఏనుగులు ఈ పంటలపై పడి నాశనం చేస్తున్నాయి.
వృక్షాలపై నుంచి కాపలా
ఈ గ్రామంలోని రైతులు వారి పొలాల వద్ద పంటలకు రక్షణగా ఏనుగుల రాకను గుర్తించేందుకు పొడవైన చెట్లపై మంచెలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రింబవళ్లు ఈ చెట్లపై ఎవరో ఒకరు ఏనుగుల రాకను గమనించేందుకు కాపలా ఉంటారు. అడవిలోంచి ఏనుగులు రాగానే భారీ శబ్ధాలు చేయడంతో పాటు బాణాసంచా పేల్చి వాటిని బెదిరించి అడవిలోకి మళ్లిస్తున్నారు.
అడవితల్లికి పూజలు
ఏనుగులు తమ పంటలపైకి రాకుండా చూడాలంటూ రైతులు అడవితల్లికి పూజలు చేస్తుంటారు. మరోవైపు రైతుల పంటల వద్ద పాతచీరలను కట్టి ఏనుగుల దృష్టిని మరల్చేందుకు యత్నిస్తుంటారు. ఏనుగుల బారినుంచి పంటలను కాపాడుకునేందుకు ప్రాచీన విధానాలనే పాటిస్తుండడం గమనార్హం.
గజరాజుల కట్టడికి రైతుల అవస్థలు


