పలమనేరు: తల్లి గర్భంలో శిశువు చనిపోయి మూడురోజులవుతున్నా ఆరోగ్యంగా ఉందంటూ ఏమార్చి వైద్యం చేసి ఏమార్చిన ఘటన శుక్రవారం పలమనేరులో వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు పలమనేరు మండలంలోని టి.వడ్డూరుకు చెందిన మునీశ్వర్ భార్య జీవిత(25) గర్భిణి. గత శనివారం పలమనేరు పట్టణంలోని డా.మీనాక్షి ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. సోమవారం వరకు ఆస్పత్రిలో తల్లిని పరీక్షించి చికిత్స చేసిన వైద్యులు గర్భంలో బిడ్డ ఆరోగ్యంగానే తెలిపారు. సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. ఇలా ఉండగా గర్భవతి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబీకులు ఆమెను గురువారం చిత్తూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షలు చేసిన వైద్యులు తల్లి గర్భంలో శిశువు మృతిచెందిందని తెలిపారు. అనంతరం తల్లి గర్భం నుంచి మృత శిశువును శుక్రవారం వేరుచేసి డిశ్చార్జి చేశారు. శుక్రవారం రాత్రి బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్తులు పలమనేరులోని మీనాక్షి ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకున దిగారు. గర్భంలో బిడ్డ చనిపోయి ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు చికిత్స పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితురాలి బంధువులు, స్థానికులు దుమ్మెత్తి పోశారు. ఈ విషయం స్థానిక పోలీసుల చెంతకు చేరింది. ఈ ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకోన్నునట్టు పలమనేరు పట్టణ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.


