రేణిగుంట: భర్త మద్యానికి బానిస కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం, కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఎం.రవి, ఎం.సులోచన దంపతుల కుమార్తె కీర్తి (30)కి, సోమల మండలంచ వడ్డిపల్లికి చెందిన సునీల్‌కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె (11), కుమారుడు (9) ఉన్నారు. ప్రస్తుతం వీరు రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ, తారకరామ నగర్‌లోని ప్లాట్ నెం.2110 లో నివాసం ఉంటున్నారు. సునీల్‌కుమార్ ఎలక్ట్రీషియన్ కాగా.. మద్యానికి బానిసై సంపాదనను వ్యసనానికే ఖర్చు చేసేవాడు. ఈ విషయమై పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి సునీల్‌కుమార్ మద్యం తాగి ఇంటికి రావడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటలకు ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో కీర్తి బయటకు వచ్చి గడియపెట్టి, ఇంటి బయట వరండాలోని పైకప్పు ఇనుప కడ్డీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి 12.15 గంటల సమయంలో మెలకువ వచ్చి చూడగా కీర్తి విగత జీవిగా కనిపించింది. మృతురాలి తల్లి ఎం.సులోచన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.


