పుత్తూరు:పాల వ్యాపారిని దోచుకునేందుకు నలుగురు దుండగులు విఫలయత్నం చేసిన ఘటన మంగళవారం పుత్తూరు పట్టణంలో జరిగింది. బాధితుడు దొరస్వామి కథనం మేరకు.. పుత్తూరు మండలం ఉజ్జినాయుడు కండ్రిగకు చెందిన దొరస్వామి ప్రతిరోజూ మోటర్‌సైకిల్‌పై వెళ్లి పాలను తన ఖాతాదారుల ఇంటికి వెళ్లి పోస్తుంటాడు. మంగళవారం పాలు పోసేందుకు ఉదయం 10 గంటల సమయంలో స్థానిక జెండామాను వీధి ఎక్స్‌టెన్ష్‌న్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో మోటర్‌సైకిల్ నుంచి కింద పడిపోయినట్లుగా ఇద్దరు యువకులు కనిపించారు. అంకుల్ పైకి లేపండంటూ యువకులు పిలిచారు. దీంతో దొరస్వామి తన మోటర్‌సైకిల్ ఆపి వారికి సహాయం చేయబోతుండగా మరో ఇద్దరు యువకులు వచ్చి దొరస్వామి గొంతు పట్టుకొని, జేబులోని డబ్బును లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే దొరస్వామి ఒక్కసారిగా విధిలించుకొని వారిపైకి తిరగబడడంతో అందరూ పరారయ్యారు. దీనిపై దొరస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


