గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాం. అప్పట్లో మమ్మల్ని వివిధ పురస్కారాలు, నగదుతో సత్కరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి.. తర్వాత మమ్మల్ని పక్కనపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరిచిపోయారు. ఈ విధంగా నమ్మించి మోసం చేయడం సరికాదు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు పేరుతో టీడీపీ కార్యకర్తలకు ప్రజా ధనం దోచిపెట్టేందుకు తెగబడుతున్నారు. ఇది మరీ దారుణం.
– రాజేష్, మాజీ వలంటీర్, గోపిశెట్టిపల్లె, కార్వేటినగరం మండలం
ప్రాణాలకు తెగించి సేవలందించాం
కరోనా మహమ్మారి సమయంలో మా ప్రాణాలకు తెగించి మరీ రోగులకు సేవలు అందించాం, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేశాం. అలాంటి వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైన విధానం కాదు. మాపై కక్ష సాధింపు వదిలిపెట్టి నెలవారీ జీతాలు ఇచ్చేలా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. అంతేకానీ, కేవలం ప్రచారం కోసం ప్రజల డబ్బును సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు పంచిపెట్టడం మంచి విధానం కాదు. దీంతో టీడీపీ శ్రేణులకు మేలు చేకూరుతుందేమో కానీ, ప్రజలకు మాత్రం నష్టమే.
– అజిత్, మాజీ వలంటీర్, గోపిశెట్టిపల్లె, కార్వేటినగరం మండలం


