గంగవరం : మండలంలోని కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండవ రోజు కంకణభట్టార్ శ్రీకాంత్ ఆచార్యులు, ఆగమ సలహాదారు ఏకే నరసింహాచార్యులు, అర్చక బృందం వేద మంత్రోచ్చారణల నడుమ పవిత్ర ప్రతిష్ఠ, కుంభారాధన, హోమం జరిపించారు. ఈ క్రమంలోనే ఉదయం శ్రీవారికి సుప్రభాతసేవ, తోమాల సేవ, ఘంటానాథం, నిత్య కై ంకర్యాలను సమర్పించారు. అనంతరం శ్రీవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బుధవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం, పవిత్ర సమర్పణ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
గంగవరం : మండలంలోని కల్లుపల్లెలో ఓ వృద్ధుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. గ్రామానికి చెందిన ఎల్‌కే నాయుడు (67) ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇది జీర్ణించుకోలేక మనస్తాపంలో తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
అప్పుల బాధ తాళలేక బలవన్మరణం
బంగారుపాళెం: మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లో ఓ వ్యక్తి అప్పుల బాధ తాళలేక బలన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. గ్రామానికి చెందిన నారాయణ ఆచ్చారి(50) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. తీసుకున్న అప్పును సకాలంలో తీర్చలేక మనస్తాపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బేకరీలో అగ్ని ప్రమాదం
– రూ.25 లక్షల నష్టం
కుప్పం: గుడుపల్లె రోడ్డులోని రత్న మినరల్ ఎంటర్ ప్రైజస్ సర్కిల్ వద్ద ఓ బేకరిలో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని తెలిపారు. కుప్పం మండలం నాయునూరు గ్రామానికి చెందిన బాలాజీ సోమవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 11 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బేకరిలో మంటల చెలరేగాయి. చుట్టుపక్కల వారి సమాచారంలో ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేసేలోపే బేకరీలోని ఫర్నీచర్, పరికరాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.25లక్షల వరకు నష్టపోయినట్లు దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
10న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ నెల 10వ తేదీన నిడ్జామ్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్షుడు దీనదయాళ్, ప్రధాన కార్యదర్శి రాబర్ట్ తెలిపారు. మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. 20వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌ను పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు చేపడతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 7:30 గంటలకు చిత్తూరు మెసానికల్ మైదానంలో 14, 16 ఏళ్ల బాలబాలికలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు 8686867079, 9966799710, 9642009767 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ పనులపై సమీక్ష
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సాగుతున్న విద్యుత్ పనులపై ఆ శాఖ మంత్రి రవికుమార్ సమీక్షించారు. మంగళవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన పనులను ఎస్‌ఈ అమర్‌బాబు వివరించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుం పథకాల పురోగతిని తెలియజేశారు. అలాగే ప్రతి వారం నిర్వహించే డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో వస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాల నివేదికను వెల్లడించారు. కరెంటోళ్ల జనబాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. ఆర్డీఎస్‌ఎస్ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, సుబ్రమణ్యం, రఘు పాల్గొన్నారు.


