మహిమాన్వితం.. మహత్తర తీర్థం | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం.. మహత్తర తీర్థం

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

తిరుమల : శ్రీమహా విష్ణువు పాదోద్భవమై, బ్రహ్మకరస్పర్శతో పవిత్రమైన మహిమాన్విత మహత్తర తీర్థం.. తిరుమల శ్రీవారి పుష్కరిణి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అత్యంత పావనమైన అరవై ఆరు కోట్ల తీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. అందులో ఒకే శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉండే పుష్కరిణి తీర్థం. ఇది వైకుంఠం నుంచి గరుడుడు తీసుకువచ్చిన క్రీడా పర్వతంలో సరస్సుగా ఉన్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఈ తీర్థ ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో కనిపిస్తుంది. వేంకటాచలంలోని తీర్థాలకు ఈ పుష్కరిణి అవతార స్థానంగా పేర్కొనబడింది. ఈ పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విజయనగర రాజు సాలువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళి మండపం నిర్మించారు. తర్వాత తాళ్లపాక అన్నమయ్య ఆ మండపం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవల్లో పుష్కరిణి వద్ద హారతి ఇస్తారు. మిగతా సమయంలో ప్రతిరోజూ సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం పుష్కరిణి హారతి ఇస్తారు. పుష్కరిణి హారతి, పూజ గురించి 12 శతాబ్దం నాటి శాసనాల్లోనూ పొందుపరిచారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి పుష్కరిణి హారతిని కొనసాగించినట్టు తెలుస్తోంది. 1972లో శ్రీవారి పుష్కరిణిలో ఫిల్టర్లతోపాటు కాలువలను ఏర్పాటుచేశారు. తరచుగా పుష్కరిణిలోని నీటిని తొలగించి తాజా నీటిని నింపుతారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాల నుంచి ప్రవహిస్తున్న స్వామి పుష్కరిణీ ప్రభావం వర్ణనాతీతం. దీని దర్శనం, స్పర్శనం, స్మరణం కూడా సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,252 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,683 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement