చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం వర్చువల్ విధానంలో 8 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణులకు నాణ్యమైన ప్రాథమిక వైద్యం అందించడంలో ఈ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి ఆయుష్మాన్ కేంద్రంలో ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు అందిస్తారని వివరించారు. వ్యాధులను ముందస్తుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. జిల్లాలోని తూగుండ్రం (జీడీనెల్లూరు), సీఆర్ కండ్రిగ (పెనుమూరు), ఆరిమాకులపల్లె (ఎస్‌ఆర్‌పురం), పైపాళ్యం (కుప్పం), కోసలనగరం (విజయపురం), కీలపట్ల (గంగవరం), ఓగు (వి.కోట)లో ఆయుష్మాన్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగ శశిభూషణ్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ వెంకటప్రసాద్, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి పాల్గొన్నారు.
సూపర్‌వైజర్లు బాధ్యతగా పనిచేయాలి
జిల్లాలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సీడీపీఓలు నిరంతరం అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని తూచా తప్పక అందించాలని కోరారు. ప్రతి సూపర్‌వైజర్ 10 మంది పోషకాహార లోపం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణ నివేదికలను తక్షణమే అందించాలని కోరారు. ‘నవచేతన’ పథకంలో భాగంగా ఏఐ స్క్రీనింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శ్యామ సుగుణకుమారి, కుప్పం, పలమనేరు, చిత్తూరు సీడీపీఓలు పాల్గొన్నారు.


