భూమి ఆన్‌లైన్ సవరణ చేయండి
కార్వేటినగరం మండలం గాదంకి గ్రామానికి చెందిన ముత్యాలయ్య తన భూమి సర్వే నంబర్లు 58 ఎఫ్ (0.32 సెంట్లు), 54/19 (0.09 సెంట్లు), 54/19 (0.11 సెంట్లు), 54/17 (0.12 సెంట్లు) ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో నోషనల్ ఖాతాలో ఉన్నాయని తెలిపారు. సదరు భూమికి సంబంధించిన పట్టా, ఇతర ఆధారాలను పరిశీలించి నోషనల్ ఖాతా నుంచి తొలగించాలన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
బకాయిలు లేకున్నా
క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు
ఐరాల మండలం, పోలకల–2 గ్రామానికి చెందిన పుష్ప అనే అర్జీదారు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. 2026 మే 21 నాడే జీఎస్టీ బకాయిలన్నింటినీ క్లియర్ చేసినప్పటికీ, తనకు రావాల్సిన ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అందడంలేదని వాపోయారు. ప్రభుత్వ పథకాలు, పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నానని తెలిపారు. బాధితురాలి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నూరు శాతం వైకల్యం.. పింఛన్ రూ.15,000కు పెంచండి
పూతలపట్టు మండలం రమణయపల్లి గ్రామానికి చెందిన ఎ. పునీత్ అనే నూరు శాశ్వత వైకల్యం ఉందని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వస్తున్న రూ.6,000 పింఛన్ రోజువారీ జీవన అవసరాలు, నిరంతర వైద్య ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. స్వయం ఉపాధి సైతం చేసుకోలేని పరిస్థితి ఉన్నందున పింఛన్ మొత్తాన్ని నెలకు రూ.15,000కు పెంచాలని అభ్యర్థించారు. క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి వైద్య రికార్డులను తనిఖీ చేసి నిబంధనల మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
శ్మశానానికి స్థలం కేటాయించండి
శ్మశానానికి స్థలం కేటాయించాలని గంగాధరనెల్లూరు మండలం బందార్లపల్లి మాదిగపల్లి గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో పొలాలు, వాగుల వెంబడి, దారుల పక్కన దహన సంస్కారాలు చేయాల్సి వస్తోందన్నారు. వర్షాకాలంలో మృతదేహాలను దహనం చేయడం, ఖననం చేయడం నరకప్రాయంగా మారుతోందని తెలిపారు. శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి రహదారి, నీటి సదుపాయం కల్పించాలని కోరారు.


