సాక్షి, చిత్తూరు: మహిళా సంఘాల కోసం ఏర్పాటుచేసిన వాట్పాప్ గ్రూపుల్లో కొందరు టీడీపీ మూకలు చేరి.. తమ పార్టీ నాయకులపై అతస్య ఆరోపణలు, ఏఐ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదుచేశారు. సోమవారం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, మునిసిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్‌ను కలిసి రాత పూర్వక ఫిర్యాదులు అందచేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు పీవీ గాయత్రీదేవి, అంజలీ రెడ్డి, ప్రతిమా రెడ్డి తదితరులు అధికారులకు ఫిర్యాదు ప్రతులు అందచేశారు. ఆపై వీళ్లు మాట్లాడుతూ చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన మెప్మా విభాగంలోని మహిళా సంఘాలు, ఆర్పీలు ఏర్పాటుచేసుకున్న వాట్సాప్ గ్రూపుల్లో.. కొందరు మహిళలను బెదిరించి టీడీపీ నేతలు చేరారన్నారు. ప్రతి రోజూ మహిళా సంఘాలు ఉంటున్న గ్రూపుల్లో తమ నాయకులపై అతస్య ఆరోపణలు చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోలు పోస్టు చేస్తున్నారని తెలిపారు. దీన్ని తాము ప్రతిఘటిస్తే నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనే విషయాన్ని అధికారులు గ్రహించాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మెప్మా, డీఆర్‌డీఏ, డ్వామా అధికారులతో మాట్లాడారు. మహిళా సంఘాల గ్రూపుల్లో రాజకీయ నాయకులు ఉండడానికి వీల్లేదన్నారు. అలాగే ఏ పార్టీకి చెందిన రాజకీయ ప్రచారాలు చేయకూడదన్నారు. పార్టీలకు సంబంధించిన పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించారు.


