జిల్లాలో బాల్ స్వాస్థ్య ప్రారంభం
1.78 లక్షల మంది
చిన్నారులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
సరికొత్తగా ఆర్‌బీఎస్‌కే 2.0 ఆదేశాలు
ఆటిజమ్, డిజిటల్ ఎక్స్‌పోజర్‌పైనా ప్రత్యేక దృష్టి
38 రకాల రుగ్మతలకు ఉచిత చికిత్స
ప్రతి చిన్నారికి డిజిటల్ హెల్త్ కార్డ్
చిన్నారులకు
బిడ్డలు చేసే అల్లరి.. బోసి నవ్వులను చూస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే దూరమవుతుంది. పిల్లలు ఉండే ఇల్లు కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. అందుకే ప్రతి ఇంటిలోనూ పిల్లలు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు చిన్నారుల్లో సరైన ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. పుట్టుకతో వచ్చే సమస్యలా లేక పోషకాహార లోపమా అన్న విషయం తెలియక మానసిక వేదనతో కుమిలిపోతుంటారు. కారణం ఏదైనా వ్యాధి ముదరకముందే పసిగట్టి బిడ్డలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఉద్దేశించిందే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే 2.0). దీనికింద ప్రతి చిన్నారికీ డిజిటల్ హెల్త్‌కార్డు ఇస్తారు. తద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేసి జీవితాలను ఆనందమయం చేస్తారు.
కాణిపాకం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 536 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని చిన్నారులను జల్లెడ పట్టనున్నారు. జిల్లాలోని 2,188 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 50,355 మంది పిల్లలతో పాటు ఎన్‌రోల్ కాని 1,313 మంది చిన్నారులను రెండు విడతల్లో పరీక్షించనున్నారు. మొదటి విడత స్క్రీనింగ్ జూలై 15 నుంచి డిసెంబర్ 15 వరకు, రెండో విడత డిసెంబర్ 16 నుంచి జూన్ 15 వరకు కొనసాగుతుంది. అలాగే 2,086 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1,26,545 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 1,78,213 మంది చిన్నారులకు వైద్య తనిఖీలు నిర్వహించడమే లక్ష్యంగా వైద్యాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 126 పనిదినాల్లో రోజుకు సగటున 1,414 మందిని, వారానికి 7,072 మంది చొప్పున ప్రతినెలా 28,288 మంది చిన్నారులను కవర్ చేయాలనేది పక్కా లక్ష్యంగా చేకున్నారు.
మారిన కాలానికి తగ్గట్టుగా..
ఈ సారి అందుబాటులోకి వచ్చిన ఆర్‌బీఎస్‌కే 2.0 వర్షన్ పాతదానికంటే భిన్నంగా, ఆధునికంగా రూపుదిద్దుకుంది. పాత రకం వ్యాధులకే పరిమితం కాకుండా డిజిటల్ ఎక్స్‌పోజర్, మానసిక ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు, కిడ్నీ సంబంధిత రుగ్మతలను కూడా ఇందులో చేర్చారు. ఆయుష్ వైద్యులతో పాటు నర్సులు, కౌన్సెలర్లు, ఇతర ఆరోగ్య నిపుణులను భాగం చేస్తున్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య రికార్డులను భద్రపరిచేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డ్ పంపిణీ చేయనున్నారు. దీనిని ఆర్‌సీహెచ్, యు–విన్, పోషణ్ పోర్టళ్లతో అనుసంధానిస్తారు. చెవుడు సమస్య ఉన్న పిల్లలకు చేసే ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఉచిత వైద్యం వయోపరిమితిని 2 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచడం పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
38 రకాల రుగ్మతలకు ఉచిత సంరక్షణ
పరీక్షల్లో బిడ్డకు సమస్య ఉన్నట్లు తేలితే ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుంది. పుట్టుకతో వచ్చే గ్రహణమొర్రి, గుండె లోపాలు, డౌన్ సిండ్రోమ్, కంటి శుక్లాలు, చెవుడు, విటమిన్ ఎ, డి లోపాలు, రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపాలను గుర్తిస్తారు. అలాగే చర్మ వ్యాధులు, చిన్ననాటి మధుమేహం, ఫిట్స్, టీబీ, కిడ్నీ సమస్యలు, ఆటిజమ్, ఏడీహెచ్‌డీ, అభ్యసన లోపాలు, మాటలు సరిగా రాకపోవడం వంటి 38 రకాల రుగ్మతలను గుర్తించి ప్రాథమిక దశలోనే నివారిస్తారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, నేరుగా బడులు, అంగన్‌వాడీల వద్దకే ప్రత్యేక వైద్య బృందాలు రానున్నాయి. చిన్నారి శరీరంలో నిద్రాణంగా ఉన్న అనారోగ్యాన్ని ముందే తుంచేయడమే ఈ ప్రాజెక్ట్ ధ్యేయం. చిత్తూరు జిల్లాలో ప్రారంభం కానున్న ఈ ప్రణాళిక ఎంతోమంది పేద తల్లిదండ్రులకు కొండంత అభయాన్ని ఇస్తోంది.
లక్ష్యం మేరకు పనిచేస్తాం
జూలై 27 నుంచి ఆర్‌బీఎస్‌కే 2.0 ప్రారంభమైంది. పకడ్బందీగా స్కీనింగ్ చేస్తున్నాం. వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తాం. పిల్లలకు ఆరోగ్య భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అనారోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్యం అందేలా చూస్తాం. స్క్రీనింగ్ పరీక్షలు వంద శాతం పూర్తి చేసేందుకు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించాలి.
– నాగశశిభూషణ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు


