చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.
స్కానింగ్ సెంటర్‌లో తనిఖీలు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరం మురుకంబట్టులోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అపోలో క్లినిక్‌లో ఉన్న స్కానింగ్ సెంటర్‌ను సోమవారం జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి జి.వెంకటప్రసాద్ తనిఖీ చేశారు. చేంజ్ ఆఫ్ అడ్రస్, స్కానింగ్ సెంటర్‌లో అందిస్తున్న సేవలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాల పనితీరు, రోగుల నమోదు రిజిస్టర్లు, నివేదికల నిర్వహణ, సిబ్బంది హాజరు, సేవల నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరైనా పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ బాలసుబ్రమణ్యం, డెమో ఇన్‌చార్జి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీగా
మహబూబ్ బాషా
చిత్తూరు అర్బన్: జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా సయ్యద్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1991లో పోలీసు శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మహబూబ్ బాషా అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2005లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది సీఐడీ, కడపలో సేవలందించారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది రాయచోటి, అనంతపురం ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2026 మేలో జరిగిన పదోన్నతుల్లో అడిషనల్ ఎస్పీగా ఎంపికయ్యారు. అనంతపురంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో చిత్తూరు జిల్లాకు అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యారు. ఆయనను జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
యాదమరి: రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన సోమవారం యాదమరిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి నిర్వహణలో దొర్లిన లోపాలను గుర్తించి వాటిని తక్షణమే సవరించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాటి మేటి క్రికెటర్..
నేడు రోడ్డుపై..
పలమనేరు: 1980, 90 దశకంలో పలమనేరు పట్టణంలో గన్‌సెట్ అనే వ్యక్తి అంటే తెలి యనివారు లేరు. ఎందుకంటే ఆయన అప్పట్లో క్రికెట్‌లో మంచి ఆల్ రౌండర్‌గా పేరు గడించారు. రాయలసీమ స్థాయిలో జరిగిన ఎన్నో టోర్నమెంట్లలో పలమనేరు టీం గెలుపులో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ చేయడంతోపాటు హార్డ్ హిట్టర్‌గా పేరు సాధించారు. అప్పట్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై నా ఆర్థిక స్థోమత లేక పైస్థాయికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయనను చూసిన నాటితరం వాళ్లు ‘‘అయ్యో ఎలాంటి క్రికెటర్ ఇలా అయ్యాడే..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


