చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల జిల్లా విభజన, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన చేపడుతున్న కేడర్ కేటాయింపుల ప్రక్రియ పొరుగు జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురం, ఇతర జిల్లాల్లో ఇప్పటికే కేడర్, మీడియం, సబ్జెక్ట్‌ల వారీగా డ్రాప్ట్ సీనియారిటీ జాబితాలను ప్రచురించారు. టీచర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మొదలు పెట్టారు. తుది సవరణలను సైతం పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయోమయంలో అయ్యోర్లు
జాబితాల ప్రచురణలో జాప్యం జరుగుతుండడంతో టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. తమ సర్వీసు వివరాలు, సీనియారిటీ సంఖ్య సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం లేక ఆందోళన చెందుతున్నారు. ఆఖరి నిమిషంలో హడావుడిగా జాబితాలు విడుదల చేస్తే అభ్యంతరాలు సమర్పించేందుకు తగినంత సమయం దక్కదని అయ్యోర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే ప్రచురించాలని డిమాండ్
ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున, సర్దుబాటు, సర్వీస్ సంబంధిత ప్రక్రియలు సకాలంలో పూర్తి కావాలంటే జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని టీచర్లు కోరుతున్నారు. అన్ని కేడర్‌ల సీనియారిటీ జాబితాలను పారదర్శకంగా ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణకు తగిన సమయం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రెసిడెన్షియల్
ఆర్డర్ జాబితాలు ఏవి?
ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగా సబ్జెక్టులు, మేనేజ్‌మెంట్ వారీగా టీచర్ల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. పొరుగు జిల్లాల్లో జాబితాలను సిద్ధం చేసి డీఈవో అధికారిక వెబ్‌సైట్, ఎంఈవో, డీవైఈవో ఆఫీసుల్లో ఉంచారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయలోపం, రికార్డుల పరిశీలనలో ఆలస్యం వల్ల జాబితాలు వెలువడడం లేదు.


