ఎన్‌హెచ్ 42 అలైన్‌మెంట్ మార్చాలంటూ వి.కోట వాసుల నిరసన ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దంటూ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ, ఆయమ్మల పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ ధర్నా కలెక్టరేట్ లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అర్జీలు స్వీకరించిన డీఆర్వో మోహన్ కుమార్
కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగుడు మునివెంకటరెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పోటెత్తారు. వారి నుంచి డీఆర్వో మోహన్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ తదితర అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రజలు మాట్లాడుతూ ఎన్నిసార్లు తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా న్యాయం చేయండి సారూ అంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసులు, భవాని, డిప్యూటీ కలెక్టర్ వెంకటసునీల్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి పుల్లారెడ్డి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మా ఊరి ఉనికిని కాపాడండి
పలమనేరు–కుప్పం మధ్య ప్రతిపాదించిన ఎన్‌హెచ్–42 నాలుగు లేన్ల జాతీయ రహదారి అలైన్‌మెంట్ వల్ల తమ గ్రామానికి ముప్పు వాటిల్లుతోందని వి.కోట మండలం దానయ్యగారిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊరి మధ్యగా రహదారి వెళ్లడం వల్ల గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మించిన పురాతన ఆలయం దెబ్బతింటుందని చెప్పారు. అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, 40 ఇళ్లు, బోర్లు, భూములు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి అలైన్‌మెంట్‌ను కొద్దిగా మార్చి తమ ఊరి ఉనికిని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దు
విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడంతోపాటు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు ఆరణి ఉపేంద్ర, టి.జగన్నాధం, నాయకులు భాస్కర్, మురళీ వాపోయారు. వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే నడపాలని కోరారు. సీ్త్ర శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా 4 వేలకు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ఆయాలకు 5 నెలల జీతాలు చెల్లించాలి
నగరి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు 5 నెలలు జీతాలు చెల్లించలేదని, వారు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు ఎస్.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు వి.సి.గోపీనాథ్, ఏపీ ప్రభుత్వ పాఠశాల ఆయమ్మల వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జయకుమారి తెలిప4ఆరు. వారు మాట్లాడుతూ కలెక్టర్ జోక్యం చేసుకుని ఆయాల పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.
బడి ఉంది, పిల్లలున్నారు.. టీచర్ ఎక్కడ ?
బడి ఉంది. పిల్లలున్నారు.. టీచర్ ఎక్కడ అంటూ బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామస్తులు వాపోయారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థుల చదువు దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు జి.సుధాకర్, జి.భారతి, టి.నిర్మల, టి.భాస్కర్ సమస్యను పీజీఆర్‌ఎస్‌లో ఉన్నతాధికారులకు విన్నవించారు. అర్హత కలిగిన సోషల్ ఉపాధ్యాయుడిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.


