ఆగని ఇసుక సెగ | - | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక సెగ

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ పరిధిలోని శెట్టిన్‌తంగాల్‌లో జరుగుతున్న ఇసుక అక్రమాలపై గతవారం అధికారులకు ఫిర్యాదు అందింది. దీని వెనుక అదే పంచాయతీకి చెందిన టీడీపీ నేత ప్రవీణ్‌ ఉన్నారనే అనుమానంతో శనివారం గ్రామంలో జరిగిన ఒక గొడవలో సొంత పార్టీ నేత జయచంద్రనాయుడు దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బాధితుడు ప్రవీణ్‌ నేరుగా ఐటీ, విద్యుత్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎక్స్‌ ద్వారా, అలాగే రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులకు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే

ఇసుక దందాకు సంబంధించి జరిగిన గొడవ అధి ష్టానం వద్దకు వెళ్లడంతో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ బాధితుడు ప్రవీణ్‌ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీలో సదరు నేతలు సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రవీణ్‌ ఎమ్మెల్యేకు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది. అమరావతి నుంచి తనకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌, ఇసుక గొడవ వివరాలను ప్రవీణ్‌కు ఎమ్మెల్యే చూపించి వివరణ ఇచ్చినట్టు సమాచారం. దాడి చేసిన సదరు నేత వైఖరిపై ఎమ్మెల్యే కూడా గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మళ్లీ కూడా రచ్చ..రచ్చ

ఎమ్మెల్యేను కలిసి వచ్చిన వెంటనే ప్రవీణ్‌పై ప్రత్యర్థి వర్గం బురదజల్లే కార్యక్రమానికి తెరలేపింది. గతంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే తనయుడి సమక్షంలో ప్రవీణ్‌ వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్న పాత ఫొటోను వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేయించారు. దీన్నే బలమైన ఆయుధంగా మలుచుకుని, ప్రవీణ్‌ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ ప్రచారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆదివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ప్రవీణ్‌ నిర్ణయించుకోగా, స్థానిక టీడీపీ నేతలు తొక్కిపెట్టారు. మరోవైపు కుర్చీవేడు కాలనీకి చెందిన కొందరు యువకులతో ప్రవీణ్‌పై మళ్లీ భౌతిక దాడి చేయించేందుకు ప్రత్యర్థి వర్గం కుట్ర పన్నుతోందని టీడీపీలోని రెండు వర్గాలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా సరైన న్యాయం జరగకపోవడంతో అనంతాపురం పంచాయతీలో జరుగుతున్న ఇసుక అక్రమాలు, దందాలు, అరాచకాలపై ఆధారాలతో సహా నేరుగా మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రవీణ్‌ సిద్ధమయ్యాడని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ఈ ఇసుక గొడవలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుండడంతో చిత్తూరు రూరల్‌ మండల నేతలు అత్యవసరంగా సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement