నగరి : స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు నగరి చెస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వీకేఆర్ పురం గ్రాండ్ వరల్డ్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. జూనియర్ విభాగంలో 140 మంది, సీనియర్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రీజినల్ చైర్‌పర్సన్ ప్రభాకర్ రాజు, పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఓ.బాలసుబ్రమణ్యం చెస్ ఆడి పోటీలను ప్రారంభించారు. ప్రభాకర్‌రాజు మాట్లాడుతూ పూర్వం రాజులు యుద్ధంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగమన్నారు. అది క్రీడగా మారి విశ్వవ్యాప్తమైందన్నారు. ఈ క్రీడతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 29 యేళ్ల క్రితం స్నేహితుల దినోత్సవం రోజు ఈ పోటీలను నగరిలో ప్రారంభించినట్టు తెలిపారు. నేడు అదే స్నేహితుల దినోత్సవం రోజున పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గజేంద్ర మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ ఫైనల్స్ జరుగుతాయని, విజేతలకు బహమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చదరంగ నిపుణులు నవీన్‌కుమార్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్‌కుమార్, కోశాధికారి శక్తివేలు తదితరులు పాల్గొన్నారు.


