కలెక్టరేట్ వద్ద
ఖైదీల తరహా తనిఖీలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : సమస్యలు తట్టుకోలేక, స్థానిక అధికారులు న్యాయం చేయకపోతే సామాన్య ప్రజలు ఆశ్రయించే చివరి వేదిక కలెక్టరేట్. కానీ నేడు కలెక్టరేట్ ఒక ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంలా లేదు. అదొక హై–సెక్యూరిటీ జైలును తలపిస్తోంది. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) కు వచ్చే అర్జీదారులను కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దే పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేసి, అవమానకర రీతిలో లోపలికి పంపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కలెక్టరేట్ ప్రాంగణంలో వరుసగా కొందరు అర్జీదారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడాన్ని సాకుగా చూపిస్తూ యంత్రాంగం ఈ ముమ్మర తనిఖీలకు తెరలేపింది. బ్యాగులు విప్పడం, జేబులు తడమడం, అనుమానంగా చూడడం.. ఇదీ సోమవారం కలెక్టరేట్ గేట్ వద్ద కనిపించిన దృశ్యాలు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే... సామాన్యులు పెట్రోల్ బాటిళ్లతో కలెక్టరేట్ మెట్లెక్కాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది?.. మండల స్థాయిల్లో, గ్రామ సచివాలయాల్లో అర్జీదారుల సమస్యలు పరిష్కారమైతే వారు చిత్తూరు వరకు ఎందుకు వస్తారు?.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి తహసీల్దార్లు ‘నేనేం చేయలేను’ అని చేతులెత్తేస్తుంటే, బాధితులకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం ఏం కనిపిస్తుంది?.. వ్యవస్థలోని లోపాలను, కిందిస్థాయి అధికారుల చేతకానితనాన్ని సవరించాల్సిన పాలకులు.. దాన్ని వదిలేసి, బాధితులనే అనుమానితులుగా చూడడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది.
సమస్యను చంపేయడమే పరిష్కారమా?
అర్జీదారులను గేటు వద్దే ఆపి, తనిఖీలు చేసి లోపలికి పంపడం ద్వారా ఆత్మహత్యలను ఆపగలరేమో కానీ, వారి గుండెల్లో రగులుతున్న ఆవేదనను, ఆక్రోశాన్ని ఆపగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పెట్రోల్ బాటిల్ తనిఖీల్లో దొరికిపోవచ్చు.. కానీ ఆ నిరుపేద అర్జీదారుడి కడుపు కోతను ఏ తనిఖీలతో గుర్తిస్తారో అర్థంగాని పరిస్థితి. పోలీసుల పహారా నడుమ, కంచెలు దాటుకుంటూ వెళ్లి కలెక్టర్‌కు అర్జీ ఇచ్చుకునే ఈ అప్రజాస్వామిక విధా నం కూటమి ప్రభుత్వ ప్రజాపాలన నినాదానికే గొడ్డ లిపెట్టు అని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు తనిఖీల పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఆపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


