గ్రామ పంచాయతీల ఓటరు జాబితా ప్రచురణ మొత్తం ఓటర్లు 10,26,821 మంది మహిళలు 5,19,091 మంది నాలుగు మండలాల్లో పురుషులు అధికం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. జాబితాలను పంచాయతీ కేంద్రాలు, సచివాలయాల్లో పెట్టారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించారు. ఈ ఓటర్ల జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు.
నిర్ణేతలు మహిళలే!
జిల్లాలో 27 మండలాలు, 623 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 5,914 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్లు 10,26,821 మంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది. 11,388 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. వాటిలో జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పురుషులు 18,368 మంది, మహిళలు 18,232 మంది, కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లెలో పురుషులు 17,824 మంది, మహిళలు 17,719 మంది, కుప్పంలో పురుషులు 29,355 మంది, మహిళలు 29,000 మంది, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో పురుషులు 21,990 మంది, మహిళలు 21,964 మంది ఉన్నారు. మిగిలిన 23 మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 27గా గుర్తించగా అందులో కుప్పంలో 8 మంది ఉన్నారు. బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఎస్‌ఆర్‌పురం, తవణంపల్లె, వెదురుకుప్పం, యాదమరి, గుడు పల్లె, రామకుప్పం, కార్వేటినగరంలో ఒకరు, ఇద్దరు ఉన్నారు. జాబితా విడుదలకు ముందు అధికారులు ఓటర్ల మ్యాపింగ్ కూడా చేపట్టారు.
నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ వారిదే పైచేయి. ఈ ఓటరు జాబితాను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
స్థానికంలో మహిళా ఓటర్లే అధికం


