లంచాల్లో నం.1! | - | Sakshi
Sakshi News home page

లంచాల్లో నం.1!

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

అక్రమాలు.. వసూళ్లు.. పంకాల ఆరోపణలు నాడు గుట్కా.. లింగ నిర్ధారణ కేసుల్లో అవినీతి మరకలు స్వయాన కలెక్టర్‌ రంగంలోకి దిగిన కేసుల్లోనూ లంచాలు అధికారుల ఆదేశాలు కాదనలేక సిబ్బంది పాట్లు క్షమించినా మారకపోవడంతో వేటు వేసిన ఎస్పీ వివాదాలకు కేంద్రంగా చిత్తూరు వన్‌టౌన్‌ స్టేషన్‌

అవినీతి ఆరోపణలపై సస్పెండైన మహేశ్వర వ్యవహార శైలిపై తొలి నుంచే వివాదాలు, ఆరోపణలు చుట్టుముట్టాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోవడానికి ప్రస్తుత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్వయంగా రంగంలోకి దిగి ఓ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించారు. కానీ నిందితుల వద్ద భారీ మొత్తంలో నగదు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఓ ఉద్యోగిపై కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, అతడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో నగదు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

గుట్కాను స్మగ్లింగ్‌ చేసిన ఓ వ్యాపారి నుంచి రూ.లక్షల్లో లంచం తీసుకోవడంపై అప్పటి ఎస్పీ మణికంఠ నివేదిక తెప్పించుకుని వేటు వేయడానిక సిద్ధమయ్యారు. కానీ ఆయన బదిలీపై వెళ్లడంతో తృటిలో తప్పించుకున్నారు.

తాజాగా ఐపీఎల్‌ బెట్టింగుల నిందితులను పట్టుకుని, కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు కొందరిని ఓ ప్రాంతానికి రప్పించి.. తానే రంగప్రవేశం చేసిన ఇన్‌స్పెక్టర్‌ రూ.లక్షల్లో మామూళ్లు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన డూడీ.. సాంకేతిక ఆధారాలన్నీ తన టేబుల్‌పైకి తెప్పించుకున్నారు. ఇతడిని ఉపేక్షిస్తే తప్పు చేసేవాళ్లు భయపడరని గ్రహించి సస్పెన్షన్‌కు ప్రతిపాదించడం, ఐజీ సస్పెండ్‌ చేయడం జరిగిపోయింది.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారితో పాటు కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారికి స్థానచలనం కల్పించి చేతులు దులుపుకున్నా పరిస్థితి మారలేదు. ఇప్పుడు ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌కు గురవడం జిల్లా పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది.

తీరు మారదా?

చిత్తూరు నగరంలోని కట్టమంచిలో గత ఏడాది ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకున్నారు. కానీ విచారణలో ఏం తేలిందనే విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. కేవలం ఓ అధికారిని మాత్రం వీఆర్‌కు పంపించారు. ఆర్నెళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హోంగార్డును సొంత పనులకు పంపించారనే ఆరోపణలపై హెడ్‌ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు తీసుకున్నారు. ఈ వ్యహారంలో ఇన్‌స్పెక్టర్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి హెడ్‌ కానిస్టేబుల్‌ను బలిపశువును చేశాడనేది స్టేషన్‌ సిబ్బంది ఆవేదన.

ఫలితమివ్వని వాస్తు మార్పులు

వన్‌టౌన్‌ స్టేషన్‌లో పనిచేసే ఒకరిద్దరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సిబ్బందిని వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ పనిచేసే మిగిలిన వాళ్లు నలిగిపోతున్నారు. అధికారులు చెప్పిన పనులు చేస్తూ.., వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇతర సిబ్బందిపై తప్పుడు మాటలు చెప్పడం, స్టేషన్‌లో జరిగే విషయాలను నేతలకు ఉప్పందించడం లాంటి విమర్శలు ఎదుర్కొనేవాళ్లు బాగానే ఉన్నారని.. ఏమీ తెలియని తమపై ఒత్తిడి పెరుగుతోందని పలువురు వాపోతున్నారు. అయితే గతంలో జరిగిన ఘటనలకు దృష్టిలో పెట్టుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఈశాన్యంలో బరువు ఉండటమే దీనికి కారణమని భావించి, పలు తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను ఈశాన్యం నుంచి తీయించి, మరోవైపుకు మార్చారు. తన సీటును ఉత్తరంవైపు కాకుండా తూర్పువైపు పెట్టుకున్నారు. కానీ మారాల్సింది తప్పుచేసే వాళ్ల బుద్ధి అని గుర్తించలేకపోయారు.

వివాదాలకు కేంద్రంగా చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

ఒకటా.. రెండా..?

Advertisement
 
Advertisement
Advertisement