● నల్ల బ్యాడ్జీలతో నిరసన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్య విద్య–ఆరోగ్య శాఖల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు.
యూనియన్ నాయకులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన తెలపాలని, 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్పత్రుల గేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్‌లో 80 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 300మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరూ ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు.
ఏళ్ల తరబడి పోరాటం
వైద్య రంగంలో ఉద్యోగుల హక్కుల కోసం గత 73 ఏళ్లుగా పోరాడుతున్నామని యూనియన్ నేతలు తెలిపారు. 1999లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడం, కారుణ్య నియామకాలు సాధించడం, పెన్షన్, సేవా విషయాల్లో అనేక సమస్యలు పరిష్కరించడం తమ యూనియన్ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. వివిధ విభాగాధిపతులతో జరిగిన సంయుక్త సమావేశాల ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పలు కీలక సమస్యలు పేరుకుపోయాయని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, వేతనాల్లో కోతలు విధించడం దారుణమన్నారు.
వైద్యసేవలపై నిరసనల ప్రభావం
పలు సాంకేతిక, పరిపాలనా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం తక్షణం స్పందించి చర్చలకు రావాలని యూనియన్ హెచ్చరించింది. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేసింది. ఈ నిరసనల ప్రభావంవైద్య సేవలపై పడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి 36 శాతం ఐఆర్ మంజూరు
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి అమలు
పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతాల చెల్లింపు
నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి రిస్క్, నైట్ డ్యూటీ అలవెన్సులు
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాల పెంపు
ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు
ఎన్‌హెచ్‌ఎమ్ సిబ్బందికి సమయానికి జీతాలు, సెలవులు


