చిత్తూరు కార్పొరేషన్: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విసృత్త స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్షధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సదరం రీవెరిఫికేషన్ పేరుతో 1.17 లక్షల మంది పింఛనుకు అర్హత లేదని నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. వీటిపై పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలపడంతో వెనక్కితగ్గి పింఛన్లు ఇస్తోందని తెలిపారు. అప్పిలు చేసుకున్న వారికి సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. అన్ని బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని, బస్సులో రెండు సీట్లను ఐదుకు పెంచాలని కోరారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం అమలు కావడం లేదన్నారు. జోన్–4 వర్కింగ్ ప్రెసెడెంట్ నాగేంద్ర, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో 8 వేల మంది పింఛనుకు అనర్హులని నోటీసులు ఇచ్చారని తెలిపారు. గతంలో కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతినెలా పింఛన్లు ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా పింఛను కోసం పడిగాపులు కాస్తున్నట్టు వివరించారు. గతంలో 90 శాతం వైకల్యం ఉన్నవారికి ప్రస్తుతం 50 శాతం మాత్రమే ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్టు తెలిపారు. 70 శాతం, అంత కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే మూడు చక్రాల వాహనాలు ఇస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. పాలసముద్రం మండలంలో ఇటీవల ఇంటి పన్ను కట్టలేదని వికలాంగుడు గురుస్వామికి పింఛను ఆపేస్తామని బెదిరింపులకు దిగారని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ఈ కూటమి ప్రభత్వుంలో నిర్వీర్యం అవుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులకు అండగా ఉంటానన్న పవన్‌కల్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, తిరుపతి, సత్యవేడు, నియోజకవర్గాల అధ్యక్షులు పాండు, రమేష్, చిరంజీవి, రెడ్డిసుబ్బయ్య, బాలకృష్ణయాదవ్, దేవదాసురెడ్డి, నాయకులు సుమతి, అరుణ, ప్రశాంతి, మున్నెష్, మురళీగౌడ్, హేమంత్, రఫీ పాల్గొన్నారు.


