నగరి : ‘అభివృద్ధి అంటే ఏంటో ఐదేళ్లలో చూపించాం.. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేక ఓడిపోయాం’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం నగరి పట్టణంలోని ఆమె నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గంలో పదవీ కాలం పూర్తిచేసుకున్న సర్పంచ్‌లను ఆమె సన్మానించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు ప్రజాసమస్యలు పరిష్కరించడంలో జగనన్న సహకారంతో సఫలీకృతం అయ్యారన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం జగనన్న అందరికీ నేర్పించారన్నారు. పుత్తూరులో గతంలో ఎంపీపీగా ఉన్న వ్యక్తి తన స్వగ్రామం గొల్లపల్లిలో చేయలేని అభివృద్ధి అక్కడ గెలిచిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ చేయగలిగారన్నారు. నిండ్ర హెడ్ క్వార్టర్స్‌లో బస్టాండు, నీళ్లు, రోడ్లు లేకపోయినా గతంలో మంత్రులు, జెడ్పీటీసీలుగా ఉన్న వారు వాటిని పరిష్కరించలేకపోయారన్నారు. ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఆ పనులు చేయగలిగారన్నారు. నగరి మండలం, బుగ్గ అగ్రహారంలో తాగునీటి సమస్యను అక్కడి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పరిష్కరించగలిగారన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ప్రతి సర్పంచ్ నేడు కాలర్ ఎత్తుకుని తిరిగే పరిస్థితిని జగనన్న సహకారంతో తాను కల్పించారన్నారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే అర్హత మనకు మాత్రమే ఉందని, మళ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తాను నిరూపించుకుందామన్నారు.
కొండలు, కొండచుట్టు మండపం
ఆయనకు ఒక్కటే
నగరి ఎమ్మెల్యేకు కొండలు, కొండచుట్టు మండపం ఒక్కటేనని, దేన్ని కొట్టేసినా ఆయన పట్టించుకోరన్నారు. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన కొండచుట్టు మండపాన్ని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకే ఎక్కువగా ఉంటుందని, కూటమి పార్టీ కేంద్రంలో ఉందని, ఎందుకు ఆయన చొరవ తీసుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. తాను ఎంపీల సహకారంతో ఢిల్లీకి వెళ్లి కొండచుట్టు మండపం కొట్టకుండా ఆపగలిగానన్నారు. జాతీయ రహదారి కాంట్రాక్టుదారులు డబ్బులు ఇస్తే పనులు జరిగేలా చూడడం, లేకుంటే ఆపేయడం ఆయన చేస్తున్న పని అంటూ ఆరోపించారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే కేటగిరీలు ఇలాగే ఉంటాయన్నారు.
అభివృద్ధి చేయరా?
ప్రస్తుత ప్రభుత్వంలో కొత్త అభివృద్ధి పనులు ఏవీ చేయడం లేదని గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు చేరువకాకుండా అడ్డుకోవడమే కర్తవ్యంగా కాలం వెళ్లదీస్తున్నారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. పుత్తూరులో తాజ్‌మహల్‌లా షాదీమహల్ కట్టిస్తే దాన్ని వినియోగంలోకి తేవడం లేదన్నారు. నిండ్రలో పిచ్చిమొక్కలు పేరుకుపోయి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మిస్తే దానికి కుంభాభిషేకం కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తప్పక వారికి బుద్ధిచెబుతారన్నారు. ఐఈ కార్యక్రమంలో ఐదు మండలాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


