దోపిడీ వైద్యం! | - | Sakshi
Sakshi News home page

దోపిడీ వైద్యం!

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

● చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్‌లో ఓ ప్రవేట్‌ ఆస్పత్రి ఉంది. ఓ మహిళ అనారోగ్య సమస్యతో ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ సిబ్బంది సమస్యను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ లేరు.. ఫోన్లో చికిత్స చెబుతారు.. ఓపీ ఫీజు రూ.500 అంటూ చెప్పుకొచ్చారు. షాక్‌కు గురైన ఆ మహిళ వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఆస్పత్రిలో గర్భవతులను టార్గెట్‌ చేసి రూ.5 వేల వరకు నెలవారి మందులు అంటగడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ● ... ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే. ఇలాంటి కేసులు జిల్లాలో కోకొల్లలు. ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ లేకపోవడం పేద రోగులకు శాపంగా మారుతోంది. ఫీజులు.. టెస్ట్‌ల పేరుతోనే వేలకు వేలు గుంజేస్తున్నారు. రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి ముకుతాడు వేయాల్సిన సంబంధిత జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తమకెందుకులే అన్నట్టు గాలికొదిలేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే డీఎంహెచ్‌ఓ అయినా వీటిపై ఓ కన్నేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. శ్రీ

ఓపీలు, టెస్ట్‌ల పేరుతో భారీగా వసూళ్లు పట్టనట్టు వ్యవహరిస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆపసోపాలు పడుతున్న పేద రోగులు

కాణిపాకం : జబ్బు తగ్గాలంటే డబ్బు ఖర్చు చేయాలి అనే మాటను అక్షరాలా నిజం చేస్తున్న పరిస్థితులు చిత్తూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పేరుతో జరుగుతున్న భారీ వసూళ్లు సామాన్య ప్రజలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చిన్న జ్వరం, దగ్గు, సాధారణ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్లిన రోగి, బయటకు వచ్చే సమయానికి వేలల్లో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఓపీక లేదయ్యా!

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే మొదలయ్యే ది ‘ఓపీ ఫీజు’. సాధారణంగా రూ.200, రూ.300 మధ్య ఉండాల్సిన ఫీజు కొన్ని ఆస్పత్రుల్లో రూ.500 నుంచి రూ.800, రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రముఖ డాక్టర్ల పేరుతో అయితే ఈ ఫీజు ఇంకా ఎక్కువ. జిల్లాలో వెయ్యికి పైగా ప్రయివేట్‌ ఆస్పత్రులుంటే.. ఇందులో పలు ఆస్పత్రుల్లో పీజు దోపిడీ చేస్తున్నట్టు పలువురు కంటతడి పెడుతున్నారు.

టెక్నాలజీ దందా

టెక్నాలజీ పేరుతో కొత్తగా మొదలైన మరో దందా ఫోన్‌ కన్సల్టేషన్‌. రోగి ఆస్పత్రికి రాకుండా ఫోన్‌లో మాట్లాడినా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఐదు నిమిషాలు మాట్లాడితే ఐదు వేల రూపాయల బిల్లు చెల్లించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనవసర పరీక్షలు.. వేలల్లో ఫీజులు

డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన వెంటనే రోగికి వరుసగా పరీక్షల జాబితా అందజేయడం సాధారణమైపోయింది. రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు, ఇతర డయాగ్నస్టిక్‌ టెస్టులు అవసరం ఉన్నా లేకపోయినా సూచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ కేసుకే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం.

పేదలే టార్గెట్‌

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అమాయకులు, వైద్యంపై అవగాహన లేని వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. డాక్టర్‌ చెప్పిందే కరెక్ట్‌ అని నమ్మే పరిస్థితిని ఆస్పత్రులు లాభాలుగా మలుచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రోగులు అప్పు చేసి చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.

పర్యవేక్షణ గాలికి

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులపై పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశాఖ తరచూ తనిఖీలు చేయకపోవడం, ఫీజులపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడం వల్ల ఆస్పత్రులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి.

కొత్త డీఎంహెచ్‌వోపై ఆశలు

జిల్లాకు కొత్తగా రానున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వసూళ్లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలో విచ్చలవిడిగా ప్రయివేటు ఆస్పత్రులు

వసూల్‌ రాజాలు

రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధికంగా డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులను ప్రజలు ‘వసూల్‌ రాజాలు’గా అభివర్ణిస్తున్నారు. చికిత్సకంటే డబ్బులే ముఖ్యమయ్యా యని విమర్శిస్తున్నారు. అధిక ఫీజు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేయాలి. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలి. ఫీజుపై ప్రభుత్వ నియంత్రణ విధించాలి. ప్రతి బిల్లును పారదర్శకంగా చూపించే విధానం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రజాసంఘాలు, బాధితులు కలిసి అధికారులకు వినతిపత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు కొందరు సిబ్బంది కొమ్ముకాస్తూ వసూల్‌ రాజా అవతారం ఎత్తారని వారు మండిపడుతున్నారు.

ఆస్పత్రుల్లోనే మందుల మాఫియా

బయట తక్కువ ధరకు లభించే మందులను ఆస్పత్రుల్లోనే కొనాలని రోగులను బలవంతం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘డాక్టర్‌ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ బయట చూపించొదు’్ద అంటూ చెప్పడం, ఆస్పత్రిలోని ఫార్మసీలోనే మందులు కొనాలని ఒత్తిడి చేయడం సాధారణమైపోయింది. ఈ విధంగా ఒక్కో కేసులో రూ.1000–3000 అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement