ఏరులై పారుతున్న మద్యం | - | Sakshi
Sakshi News home page

ఏరులై పారుతున్న మద్యం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

మద్యం మహమ్మారికిపేద కుటుంబాలు విచ్ఛిన్నం తమిళనాడు తరహాలో కోర్టులు తీర్పులివ్వాలి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

కార్వేటినగరం: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి నిత్యాసవసర వస్తువు ల్లా సులభంగా దొరుకుతోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయస్వామి ఆరోపించారు. మద్యం బారిన పడి పేద కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆయన బుధవారం శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లెమిట్టలో ఉన్న దీపికా కల్యాణ మండపంలో జరిగిన మాజీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మద్యం, గంజాయి బారిన పడి యువకులు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. అధికారులు గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.

బాధితులపైనే కేసులు

కూటమి నేతలు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. రేపు మా ప్రభుత్వం వస్తే అవినీతి అధికారులపై విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. గంగాధరనెల్లూరులో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోందని ఆరోపించారు.

తమిళనాడు తరహాలో కోర్టులు తీర్పులు ఇవ్వాలి

కరోనా సమయంలో తమిళనాడులో జరిగిన ఓ కేసుకు సంబంధించి 8 మంది పోలీసు అధికారులకు కోర్టు ఉరిశిక్ష విధించిందని తెలిపారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా కోర్టులు తీర్పులు ఇవ్వాలని, తద్వారా కోర్టులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని నారాయణస్వామి తెలిపారు. తప్పుచేస్తే కఠిన శిక్ష పడుతుందన్న భయం అధికారుల్లో రావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారులు తప్పుడు మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

మీ బిడ్డగా ఆదరించండి

గంగాధరనెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్న కే.కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆదరించి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. పేదల బతుకులు మారాలంటే జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం

చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అమరావతి రాజధాని పేరుతో పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు. ఏమీ లేని ప్రాంతంలో రూ.లక్షల కోట్లు వెచ్చించడం కంటే మావిగన్‌ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ నగ్న సత్యాన్ని చంద్రబాబు మనుషులు దాచిపెట్టి నీతిమాలిన రాజకీయాలు చేయ డం సిగ్గుచేట్టన్నారు. జగనన్న విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం పేదలకు ఉన్నత విద్యను దూరం చేసినట్లు గుర్తు చేశారు. వైద్యరంగాన్ని నిర్వీర్యం చేశారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పేదలకు వైద్యాన్ని అందించడం లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement