కూటమి నేతల దౌర్జన్యం.. ఆందోళనతో ఆగిన అన్నదాత గుండె | The victim farmer died of a heart attack after suffering severe mental distress | Sakshi
Sakshi News home page

కూటమి నేతల దౌర్జన్యం.. ఆందోళనతో ఆగిన అన్నదాత గుండె

Apr 9 2026 5:22 AM | Updated on Apr 9 2026 5:22 AM

The victim farmer died of a heart attack after suffering severe mental distress

గతంలో నాలుగు ఎకరాలు పొలం కొనుక్కున్న మహ్మద్‌ షఫీ  

చంద్రబాబు ప్రభుత్వం రాగానే కూటమి నేతల అండతో ఆక్రమణకు కొందరి యత్నం 

ఆక్రమణదారులకే మద్దతుగా నిలిచిన రెవెన్యూ అధికారులు 

తీవ్ర మానసిక క్షోభకు గురై గుండెపోటుతో బాధిత రైతు మృతి  

చిత్తూరు జిల్లా అమ్మరాజుపల్లిలో విషాదం

పెద్దపంజాణి/పలమనేరు: భూమిపై అన్ని హక్కులూ, రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలున్నప్పటికీ కూటమి నాయకుల అండతో రెచ్చిపోతున్న ఆక్రమణదారులకే రెవెన్యూ అధికారులు అండగా నిలవడంతో ఓ రైతు గుండె ఆగిపోయింది. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడనే అధికారులు నిర్దయతో వ్యవహరించిన ఘటన చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం అమ్మరాజుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. 

గ్రామానికి చెందిన ఎస్‌.మహ్మద్‌ షఫీ (53) గతంలో అదే గ్రామానికి చెందిన అలీసాబ్‌ నుంచి నాలుగు ఎకరాల పొలం తన భార్య తస్లీం పేరిట కొనుగోలు చేశాడు. పట్టాదారు పాసుపుస్తకాలు పొందాడు. అప్పటి నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన ఇరువురు కుమారులనూ చదివించుకుంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా తన పని తాను చేసుకుపోయేవాడు.  

చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆక్రమణకు యత్నం  
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో భూమిని విక్రయించిన కుటుంబీకులే అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతల సహకారంతో భూమిని దున్నడానికి ప్రయత్నించారు. దీంతో మహ్మద్‌ షఫీ కుటుంబం వారిని అడ్డుకుంది. అయినప్పటికీ అధికార పార్టీ నేతల అండదండలతో తరచూ దౌర్జన్యం చేసేవారు. దీనిపై న్యాయం చేయాలని పలుమార్లు తహసీల్దార్‌ను షఫీ వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌ గౌడకు తన సమస్య చెప్పుకోవడంతో ఆయన తహసీల్దార్‌తో మాట్లాడారు. న్యాయం చేస్తామని చెప్పిన తహసీల్దార్‌ ఆపై పట్టించుకోలేదు. 

చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదని 
అన్ని హక్కులున్నప్పటికీ అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు దౌర్జన్యం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా కలత చెందిన బాధితుడు మహ్మద్‌ షఫీ (53) బుధవారం ఉన్నట్టుండి స్పృహ కోల్పోగా కుటుంబీకులు పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు రిఫర్‌ చేశారు. అక్కడ ఆయన మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. కూటమి నేతల కారణంగానే ఓ రైతు నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు విచారించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement