కడా పీడీ ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

కడా పీడీ ఆకస్మిక తనిఖీలు

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

● సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దళారీల రాజ్యం ● మరోసారి ఇక్కడ కనిపిస్తే కేసులు తప్పవని హెచ్చరిక

కుప్పం: కడా పీడీ వికాస్‌ మర్మత్‌ బుధవారం కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో కిక్కిరిసిన జనంపై ఆయన ఆరా తీశారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారికంటే దళారులే అధికంగా ఉన్నారని తెలుసుకుని విస్తుపోయారు. రెగులర్‌ సిబ్బంది ఎంత మంది ఉన్నారు, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు ఎందరు, దినసరి వేతనం ద్వారా పనిచేసేవారు ఎందరు ఉన్నారని ఆరా తీశారు. నలుగురు ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్‌ పద్ధతిలో పనిచేస్తున్నారని, మిగిలిన ఆరుగురు దినసరి వేతనం ద్వారా పని చేస్తున్నట్లు బయట పడింది. ఆఫీస్‌లో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే, మిగిలిన వారు 50 మందికి పైగా ఉండడమేంటని కడా పీడీ ప్రశ్నించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దళారులు అధికంగా ఉన్నట్లు తేలింది. బుధవారం నుంచి దళారులు కార్యాలయ ప్రాంగణంలో కనిపిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దళారులు రిజిస్ట్రేషన్‌ కోసం డబ్బులు డిమాండు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నాడే చెప్పిన సాక్షి

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దళారీ వ్యవస్థపై సాక్షి రెండు నెలల క్రితమే కథనాలు ప్రచురించింది. దళారులకు, పనిచేసే సిబ్బందికి తేడా లేదని, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కుర్చీల్లో కూర్చుని కార్యాలయంలో కంప్యూటర్లు లాగిన్‌ చేసుకుని దళారులే డాక్యుమెంటేషన్‌ చేసుకోవడంపై కథనాలు ప్రచురించినా అధికారులు స్పందించలేదు. బుధవారం కడా పీడీ తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. కనీసం ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement