క్షణాల్లో టెట్రా ప్యాకెట్లు మాయం
పలమనేరు: అసలే కన్నడ మద్యమంటే ఇక్కడి మందుబాబులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి తరుణంలో రోడ్డుపై టెట్రా మద్యం ప్యాకెట్లు దొరికితే వదులుతారా..?. ఇలాంటి ఘటనే పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి సమీపం పలమనేరు–కుప్పం రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లికి సమీపంలోని కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ మద్యం అక్రమరవాణా సాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లను ఓ వ్యక్తి బైక్‌పై తరలిస్తూ అక్కడి పోలీసుల కంట్లో పడ్డాడు. దీంతో ఓ కానిస్టేబుల్ అతన్ని బైక్‌లో వెంబడించాడు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్మగ్లర్ రోడ్డుపై టెట్రా ప్యాకెట్లను పడేసి వెళ్లాడు. కొన్ని ప్యాకెట్లు బాగుండగా.. మరికొన్ని పగిలిపోయాయి. పోలీసులు అతన్ని వెంబడిస్తుండగానే రోడ్డుపై పడిన టెట్రా ప్యాకెట్లను కొందరు తీసుకోవడం, ఇంకొందరు వాటిని ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపుకొని వెళ్లడం కనిపించింది. ఆ మార్గంలో వచ్చిన ఆటో వాలాలు సైతం కొన్నింటిని తస్కరించారు. నిమిషాల వ్యవధిలో రోడ్డుపై పడిన మద్యం ప్యాకెట్లను జనం మాయం చేశారు. ఆఖరుకు మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చిన వ్యక్తి దొరకకపోగా సీజ్ చేద్దామనుకున్న కన్నడ మద్యం సైతం దక్కకుండా పోయింది.


