నీవా నదిలో పడి యువకుడి మృతి
గంగాధరనెల్లూరు: నీవా నదిలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గంగాధరనెల్లూరు మండల సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మంగళవారం కోట్రకోన పంచాయతీ, ముకుందరాయనపేట వద్ద ఓ గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం కోట్రకోన పంచాయతీ, గ్యారంపల్లికి చెందిన ఓ వ్యక్తి కనబడడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించారు. మృతుడు గ్యారంపల్లికి చెందిన చిన్నబ్బ కుమారుడు సాయికుమార్‌గా కుటుంబీకులు ధ్రువీకరించారు. సాయికుమార్ (24) ట్రాక్టర్లకు ఇసుకపోసే కూలీగా జీవనం సాగించేవాడు. అతను కొద్ది రోజుల క్రితం ఉదయం బహిర్భూమికి వెళ్లి.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. భారీ వర్షాలకు ఎన్టీఆర్ జలాశయం గేట్లు తెరవడంతో నీవా నదిలో నీటి ప్రవాహం అధికమై యువకుడు కొట్టుకుపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నీవా నదిలో పడి యువకుడి మృతి


