● అన్నా.. ఆకలి..!
‘మేము లక్ష్మీనగర్ కాలనీలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నాం. కంటి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. ఆకలిగా ఉంది. ఎలా ఉండాలి ? వీళ్లు తీసుకోపోయి..వదలనంటున్నారు’ అంటూ విద్యార్థులు ఆకలి కేకలు పెట్టారు. చిత్తూరులోని జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రానికి మంగళవారం కేంద్ర బృందం పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రం అధికారులు ముందస్తు ప్రణాళికలను సమర్థవంతంగా నిర్వర్తించారు. చికిత్స పేరుతో లక్ష్మీనగర్ కాలనీలోని పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. అక్కడికి కేంద్రబృందం వచ్చేంత వరకు వాళ్ల కడుపు మాడ్చారు. ఉదయం 9 గంటలకు వస్తే.. మధ్యాహ్నం 1.30 గంటకు కూడా గడప దాటనివ్వలేదు. దీంతో వారికి ఆకలి కేకలు మొదలయ్యాయి. నీరసించిపోయిన పిల్లలను సాక్షి పలకరించింది. ఎందుకని ప్రశ్నించగా.. విషయాన్ని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా తీసుకోపోయి వదలంటున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆకలిగా ఉంది అన్న.. అంటూ ఆవేదనకు లోనయ్యారు.
– చిత్తూరు రూరల్ (కాణిపాకం)


