
వైద్యుల నిరవధిక సమ్మె
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పీహెచ్‌సీ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వంతో పీహెచ్‌సీ వైద్యుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో వైద్యులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. శనివారం కూడా సమ్మెను కొనసాగించారు. డిమాండ్లపై గళం విప్పారు.
ఏపీపీహెచ్‌సీడీఏ (ఏపీ ఫ్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్) పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యులు శనివారం కూడా సమ్మెను చేపట్టారు. విధులకు స్వస్తి పలికి చిత్తూరు నగరంలోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నల్లరిబ్బన్ ధరించి.. ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా వెలవెలబోయాయి. చికిత్స కోసం వచ్చిన రోగులు డాక్టర్ లేరని ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టారు. అక్కడక్కడా పీజీ వైద్యులు ఉన్న వారి వద్ద చికిత్స పొందేందుకు ఇష్టపడ లేదు. చాలా మంది స్టాఫ్‌నర్సులు, ఆస్పత్రి సిబ్బంది వద్ద మందులు, మాత్రలు తీసుకుని వెళ్లిపోయారు. కాగా శుక్రవారం రాత్రి ప్రభుత్వం, పీహెచ్‌సీ వైద్యుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రాష్ట్ర కమిటీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సమ్మెను కొనసాగిస్తున్నట్లు జిల్లా నాయకులు ప్రకటించారు.
ఉద్యోగోన్నతి లేకుంటే ఎలా?
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగోన్నతి లేదని పీహెచ్‌సీ వైద్య జిల్లా సంఘ నాయకులు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విపత్తులను లెక్క చేయకుండా తాము విధులను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినా తమ శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం లేదన్నారు. ప్రధానంగా పీహెచ్‌సీలో పనిచేసే వైద్యులకు ఉద్యోగోన్నతులు లేవన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సీనియర్ మెడికల్ ఆఫీసర్స్‌గానే మిగిలిపోతున్నామన్నారు. ఈ విషయంలో పీహెచ్‌సీ వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. అలాగే పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్‌లకు 30 శాతం ఉండేదన్నారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని 15 శాతానికి తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు పలు న్యాయ పరమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.