
వైద్యంపై నకిలీ పెత్తనం
డాక్టర్లు...డమ్మీ?
అనుమతులు లేని క్లినిక్‌ల విషయాన్ని పక్కన పెడితే.. డాక్టర్లు కూడా నకిలీలు తయారయ్యారు. దర్జాగా డాక్టర్లగా కొనసాగుతున్నారు. ఇష్టామొచ్చినట్లు చికిత్సలు చేస్తూ..అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది డమ్మీ డాక్టర్లు ఏకంగా ప్రసవాలు, చిన్నపిల్లల వైద్య చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర వాటికి చికిత్సలు చేస్తుండడంతోపాటు ఏకంగా సర్జరీలు చేస్తూ.. రూ.లక్షలు కాజేస్తున్నారు. రెగ్యులర్‌గా కొంత మందికి సలహాలు ఇస్తూ.. ఎంబీబీఎస్ డాక్టర్లుగా నమ్మిస్తున్నారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుట్టుకొస్తున్నారు.
జ్వరం.. దగ్గు.. ఆయాసం.. గుండెపోటు.. వ్యాధి ఏదైనా నయం కావాలంటే నాణ్యమైన వైద్యం అందాలి. అయితే నకిలీల వైద్యం రోగి బతుకులో విషం చిమ్ముతోంది. రోగిని అప్పులు పాలు చేయడమే కాకుండా అతడి ప్రాణాలను హరిస్తోంది. జిల్లాలో ఈ నకిలీల బెడదతో పలువురు నష్టపోయారు. అయినా ఏమాత్రం జంకు లేకుండా నకిలీ క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్యంపై నకిలీలు పెత్తనం చెలాయిస్తున్నాయి.
చిత్తూరురూరల్ (కాణిపాకం): జిల్లా నకిలీ వైద్యు లు, అక్రమార్కులకు చిరునామాగా మారింది. జిల్లాలో గతంలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ వెలుగుచూడగా, ఇటీవల కాలంలో నకిలీ వైద్యులు పట్టుబడుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా రెండురోజులకు కిందట ఓ డాక్టర్ నకిలీ కార్డియాలజిస్ట్ అన్న విషయం వెలుగుచూసింది. దీనికితోడు జిల్లాలో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతోంది.
జిల్లాలో 900 క్లినిక్‌లు, 250 ఆస్పత్రులు, 20 పాలీక్లినిక్‌లు, 2వేల వరకు ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతులతో నడుస్తున్నాయి. అయితే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఒకదానికి కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఇష్టానుసారంగా వైద్య కార్యకలపాలు నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, చర్చివీధి, కొంగారెడ్డిపల్లి, పలమనేరు రోడ్డు. వన్‌డిపో రోడ్డు, మిట్టూరు, మురకంబట్టు, ప్రశాంత్‌నగర్, యాదమరి, పలమనేరు, కుప్పం, ఎస్‌ఆర్ పురం, నగరి తదితర ప్రాంతాల్లో ఈ నకిలీ క్లినిక్‌లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి.
నకిలీ డాక్టర్లకు రూ.లక్షల్లో ఫీజులు
జిల్లాలో కార్డియాలజిస్ట్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గుండె జబ్బు వస్తే తిరుపతి, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, చైన్నె, కర్ణాటకలోని బెంగళూరును ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నకిలీ డాక్టర్లు డిమాండ్ ఉన్న విభాగానికి డాక్టర్‌గా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రత్యక్షమవుతున్నారు. ప్రైవేటు క్లినిక్‌లను నడిపిస్తూ రూ.లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే ఫీజుతో పాటు సకల వసతులు ఉండేలా చూసుకుంటున్నారు.
వైద్యశాఖ అనుమతులు తప్పనిసరి
ఎవరైనా వైద్యులు తమ వైద్యవృత్తిని నిర్వహించుకోవాలంటే ముందుగా డీఎంహెచ్‌ఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యకోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. వైద్యాధికారులు సదరు సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. అలాగే ఇండియన్‌న్ మెడికల్ అసోసియేషన్ మెంబర్‌షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల జీవితాలతో నకిలీ వైద్యులు చెలగాటం ఆడుతుంటే.. ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయనాయకులు, అధికారుల పలుకుబడితో వైద్యవృత్తికి సంబంధం లేని వ్యక్తులు జిల్లా కేంద్రంలో ఆస్పత్రులను నిర్వహిస్తుండడం గమనార్హం. తక్కువ మొత్తంలో జీతాలకు నామమాత్రంగా వైద్యులను తీసుకువచ్చి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి అర్హత లేని వారు వైద్యవృత్తిని కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో క్లినిక్‌ల పేరుతో నకిలీ దందా
చిత్తూరులో కలకలం సృష్టిస్తున్న నకిలీ డాక్టర్ల వ్యవహారం
అనుమతులు లేకుండా క్లినిక్‌ల నిర్వహణ
ఇష్టారాజ్యంగా వైద్యం.. పెయిన్స్ కిల్లర్స్ వారి ఆయుధం
తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా జిల్లాలోకి నకిలీ వైద్యులు
ఇదిగో సాక్ష్యం..
చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌లో కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి తన ఇంట్లోనే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జిల్లాలో సంచలనం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి స్కానింగ్ చేసి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయం కలెక్టర్ చెవిలో పడడంతో ఆయన నిఘా పెట్టి పట్టుకున్నారు. కేసు నమోదు చేయించారు. పట్టుబడిన వారిలో చిత్తూరు వాసులతో పాటు తమిళనాడు వాసులున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం మేరకు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిది గుంటూరు జిల్లా. ఇతడు కొన్నేళ్లుగా కార్డియాలజిస్ట్‌గా నమ్మిస్తున్నాడు. బాధితులు మాయగాడి అవతారాన్ని బహిర్గతం చేయడంతో నకిలీ వ్యవహరం బయటకు వచ్చింది. ఏడేళ్లకు క్రితం ఓ మీడియా కూడా కార్డియాలజిస్ట్ నకిలీ వ్యవహరాన్ని బయటపెట్టింది. కొన్నాళ్లు తలదాచుకున్న ఈ వ్యక్తి బెంగళూరు నుంచి చిత్తూరు నగరానికి వచ్చాడు. ఇక్కడ డాక్టర్‌గా నమ్మించాడు. తీరా గుట్టు బయటకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి సర్టిఫికెట్ ఎలా వచ్చింది. మెడికల్ కౌన్సిల్‌లో ఎలా పేరు నమోదైందనే విషయంపై పలువురు వైద్య నిపుణులు అవాక్కవుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్‌లో రూ.2 స్టాంప్‌లా ఉంటుందని, ఆ స్టాంప్ నకిలీ డాక్టర్ ఇచ్చుకున్న సర్టిఫికెట్‌లో లేదని, ఇది దొంగ పత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ డాక్టర్లుగా రుజువైతే కేసులుంటాయి. అలాంటివి జిల్లాలో ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బులు కోసం నకిలీ డాక్టర్లుగా అవతారమెత్తి..ప్రజల ఆరోగ్యాన్ని హరించకండి. ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులను సంప్రందించాలి. లేకుంటే గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలి. నకిలీ డాక్టర్లను నమ్మొద్దు.
– సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు

వైద్యంపై నకిలీ పెత్తనం